Minister Annpurna Devi: అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి
అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి
Annpurna Devi : మహిళలను అభ్యంతకరంగా తాకడం లైంగిక దాడి కిందని రాదంటూ ఓ మైనర్ బాలిక కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ మిశ్రా ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అంతేకాదు మహిళ ఛాతీని తాకడం అత్యాచారం కిందకు రాదని న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమౌతున్నాయి. దీనితో ఈ కేసులో హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ మిశ్రా ఇచ్చిన తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి(Union Minister) అన్నపూర్ణ దేవి తప్పుపట్టారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు సమ్మతం కాదన్న మంత్రి అన్నపూర్ణ(Annpurna Devi)… దానిని పరిశీలించాలని సుప్రీం కోర్టును కోరారు. అలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. దీనితో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది.
Union Minister Annpurna Devi – అసలేం జరిగిందంటే ?
2021 నవంబరులో… ఉత్తరప్రదేశ్ లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన మైనర్ కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిఫ్ట్ పేరిట ఆ బాలికను తమతో బైక్ లపై తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు.
అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన… పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే… అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి స్పందించారు.
Also Read : Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీట్రాప్ ! బీజేపీపై సీఎం సిద్ధు విసుర్లు !