Minister Ashwini Vaishnaw: రెండు సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు – కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

రెండు సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు - కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Ashwini Vaishnaw : వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని… సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వీరిలో 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తారని… 2025 ఆగస్టు 1 నుంచి 2027 జులై 31 వరకు ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు, కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం దిల్లీలో కేంద్ర క్యాబినెట్‌ సమావేశమై తీసుకున్న నిర్ణయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల సృష్టి పథకాన్ని రెండు భాగాలుగా అమలుచేస్తామన్నారు.

Union Minister Ashwini Vaishnaw Comments

పార్ట్‌-ఎ (తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి): ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ…ఈపీఎఫ్‌ఓలో తొలిసారి నమోదైన వారిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకం అమలుచేస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి రూ.15వేల మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లిస్తారు. రూ.లక్ష వరకు వేతనం పొందే ఉద్యోగులు అర్హులు.

పార్ట్‌-బి (యజమానులకు ఆర్థిక సాయం): ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు అదనంగా కొలువులు కల్పించే యాజమాన్యాలకు ఈఎల్‌ఐ పథకం కింద ఆర్థికసాయం అందిస్తారు. ముఖ్యంగా తయారీ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారు. సంస్థలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తే అంతమందికి నెలకు రూ.3వేల చొప్పున రెండేళ్ల పాటు యజమానులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. రూ.లక్ష వరకు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే, అదనంగా చేరిన ఉద్యోగులు కనీసం 6నెలలు అదే సంస్థలో పని చేయాలి. ఈపీఎఫ్‌ఓలో నమోదైన సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) వివరించారు.

ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ (Union Cabinet) పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల సృష్టితో పాటు ప్రైవేటు రంగంలో పరిశోధనలు, నవ్యావిష్కరణల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ స్థాయి శిక్షణలను క్రీడాకారులకు సమకూర్చడం, సంబంధిత పాలనా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం (ఖేలో భారత్‌ నీతి)-2025కి ఆమోదం తెలిపింది. 2036లో ఒలింపిక్‌ క్రీడల నిర్వహణ మన దేశానికి దక్కేలా చేసుకోవడానికి ‘వ్యూహాత్మక మార్గసూచీ’ని ప్రకటించింది. కేంద్ర బడ్జెట్‌ 2024-25లో ప్రకటించిన ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక (ఈఎల్‌ఐ) పథకం అమలుకు తాజాగా రూ.99,446 కోట్లు వెచ్చించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా నిర్ణయించింది.

పరిశోధన, అభివృద్ధి, నవకల్పన పథకం

దేశంలో ప్రైవేటు రంగంలో పరిశోధన రంగాన్ని ప్రోత్సహించడానికి రూ.లక్ష కోట్లతో సంచిత నిధి (కార్పస్‌ఫండ్‌)ని కేంద్ర మంత్రి మండలి ప్రకటించింది. దీని కోసం పరిశోధన, అభివృద్ధి, నవకల్పనల పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. పరిశోధన ప్రాజెక్టులకు దీర్ఘకాల రుణం కింద అతితక్కువ వడ్డీకీ, లేదంటే వడ్డీ లేకుండానే నిధులు అందించే ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి. ప్రపంచ క్రీడా రంగంలో భారత్‌ ఐదో అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో రూపొందించిన జాతీయ క్రీడా విధానం (ఖేలో భారత్‌ నీతి)-2025కి కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 2036 ఒలింపిక్‌ క్రీడల నిర్వహణ బిడ్డింగ్‌ను దక్కించుకునే లక్ష్యంతో తీసుకొచ్చారు.

Also Read : Rahul Gandhi: జీఎస్టీతో ఆర్థిక అన్యాయం – విపక్షనేత రాహుల్‌ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!