Minister Bandi Sanjay: సిట్ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

సిట్ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay : తెలంగాణాలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ ఎదుట వాంగ్మూలమిచ్చేందుకు బండి సంజయ్‌ (Bandi Sanjay) శుక్రవారం దిల్‌కుషా అతిథిగృహానికి వచ్చారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీల్డ్ కవర్ లో తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్ (KTR), సంతోష్‌రావుల ఫోన్లు తప్ప అందరి ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని బండి సంజయ్‌ ఆరోపించారు. ట్యాపింగ్‌ భయంతో హరీశ్‌రావు ఏడాదిపాటు ఫోన్‌ వినియోగించలేదన్నారు.

Union Minister Bandi Sanjay Attend

‘‘నా వద్ద ఉన్న ఆధారాలతో సిట్‌కు నివేదిక ఇచ్చాను. కేసీఆర్‌ ప్రభుత్వంలో అత్యధికంగా నా ఫోన్‌కాల్స్‌నే ట్యాప్‌ చేశారు. నేనే తొలి బాధితుడిని. దిల్లీ నుంచి నాకు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లనూ ట్యాప్‌ చేశారు. మావోయిస్టుల నియంత్రణకు వినియోగించాల్సిన ఎస్‌ఐబీని కేసీఆర్ (KCR), కేటీఆర్‌లు (KTR) రాజకీయ నిఘా కోసం వాడుకున్నారు. రాజకీయనేతలు, వ్యాపారులు, న్యాయవాదులు, సినిమా ప్రముఖులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లనూ ట్యాప్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజి కేసును పర్యవేక్షిస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్‌నూ ట్యాప్‌ చేశారు. రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావుల ఫోన్లూ ట్యాప్‌ అయ్యాయి. భార్యాభర్తల ఫోన్లు కూడా వినడం దారుణం. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఎవరూ సాధారణ కాల్స్‌ మాట్లాడలేకపోయారు. వాట్సప్, సిగ్నల్, ఫేస్‌టైంలో మాత్రమే మాట్లాడే పరిస్థితి ఉండేది.

బీఆర్ఎస్ మంత్రులనూ విచారణకు పిలవాలి

ఫోన్లు ట్యాప్‌ అయిన బీఆర్ఎస్ మంత్రుల జాబితా సిట్‌ వద్ద ఉంది. కేసీఆర్‌ కుమార్తె, అల్లుడి ఫోన్లనూ ట్యాప్‌ చేశారు. వాళ్లందరినీ విచారణకు పిలవాలని సిట్‌ కు చెప్పా. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు చేసిన పనుల గురించి సిట్‌ అధికారులు చెబుతుంటే సిగ్గనిపించింది. క్షణక్షణం బాధ అనుభవించేలా వాళ్లకి శిక్ష విధించాలి. ఫోన్‌ట్యాపింగ్‌తో వ్యాపారులను బ్లాక్‌మెయిల్‌ చేయడం ద్వారా కేటీఆర్‌ రూ.కోట్లు తీసుకున్నారు. ఒక కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థికి చెందిన రూ.7 కోట్లు పట్టుకున్నారు. ఇలా జప్తు చేసిన రూ.వందల కోట్లు ఏమయ్యాయి ? రూ.20 కోట్లు దొరికాయని మొదట టీవీల్లో వార్తలొస్తాయి.. తర్వాత కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ ఫోన్‌ చేస్తే అవి రూ.2 కోట్లు అవుతాయి. ఇలా ఆర్థిక లావాదేవీల్లో రూ.వందల కోట్లు చేతులు మారినా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈడీకి లేఖ ఎందుకు రాయడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.

కమిషన్లతో సర్కారు కాలయాపన

మాకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపైన అనుమానం ఉంది. ఏడాదిన్నర గడిచినా కమిషన్లతోనే కాలయాపన చేస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్‌ కుటుంబంలో ఒక్కరినైనా అరెస్ట్‌ చేశారా..? వారిద్దరూ ఒక్కటే. రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాప్‌ అయింది కదా ఆయన్ని విచారించే ధైర్యం సిట్‌ అధికారులకుందా ? జడ్జిలను విచారించే అధికారం వీళ్లకు ఉంటుందా ? అందుకే దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని అడుగుతున్నాం. అలా కాదంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య అవగాహన కుదిరినట్లే.

ఒక్కో స్కాంకు దిల్లీలో రేటు

ఒక్కో స్కాంకు దిల్లీలో రేటు కుదురుతుంది. తొలుత ఫామ్‌హౌస్‌ కేసుకు దిల్లీలో మూటలు అందించారు. ఫోన్‌ ట్యాపింగ్, కాళేశ్వరం, బియ్యం కేసుల్లోనూ ఇలాగే అప్పగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్లు దిల్లీ కాంగ్రెస్‌ పార్టీకి ఏటీఎంలా మారాయి. ఇక్కడ విచారణ ప్రారంభం కాగానే… బీఆర్ఎస్ నేతలు దిల్లీలో రూ.వందల కోట్ల మూటలు అప్పగిస్తున్నారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేసిన కేసీఆర్‌కు… రేవంత్‌రెడ్డి ఈ రోజు క్లీన్‌చిట్‌ ఇచ్చారంటేనే వారిద్దరి మధ్య ఉన్న అవగాహన ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్‌ ఏది మాట్లాడమంటే రేవంత్‌రెడ్డి అదే మాట్లాడతారు. కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయనని చెప్పే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? అలాంటప్పుడు ఈ కమిషన్లు, విచారణలెందుకు?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు.

Also Read : CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవమే వరదకు పరిష్కారం – సీఎం రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!