Minister Bandi Sanjay: కాళేశ్వరం విచారణ సీబీఐకి ఇవ్వాలి – మంత్రి బండి సంజయ్

కాళేశ్వరం విచారణ సీబీఐకి ఇవ్వాలి - మంత్రి బండి సంజయ్

Bandi Sanjay : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరపాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీజేపీపై విషప్రచారం జరుగుతోందని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా మాట్లాడారని… అదే బీజేపీ వైఖరి అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పని లేకుండా కేంద్రమే నేరుగా సీబీఐతో విచారణ చేయించే అవకాశముంటే కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో ఈపాటికే కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలులో వేసే వాళ్లమని సంజయ్‌ అన్నారు.

Union Minister Bandi Sanjay Comments on Kaleshwaram

ఆదివారం కరీంనగర్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి రేవంత్‌రెడ్డి సర్కారే రక్షణ కవచంగా ఉంటోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో సీబీఐ విచారణ జరపాలని రాహుల్‌గాంఽధీ చెప్పిన మాటలేమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని చెప్పారు. రూ.38 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్షా 20 వేల కోట్లకు అంచనాలు పెంచిన కేసీఆర్‌ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలేసి కొందరు అధికారులనే బలి చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు.

నాడు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌… నేడు అధికారంలోకి వచ్చినా సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకపోవడంతోనే కాళేశ్వరం డిజైన్‌ మార్చామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు సీడబ్ల్యూసీ రిపోర్ట్‌ ఇచ్చిందని, కావాలంటే ఆ కాపీని వాళ్లకు పంపుతానని చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే రూ.38 కోట్లతోనే పూర్తయ్యేదన్నారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్‌సఏ) రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 246 ప్రకారం పార్లమెంట్‌ ఆమోదించి ఏర్పాటు చేసిన సంస్థ అని, దాని స్వతంత్రపైనే బురదజల్లుతారా..? అని మండిపడ్డారు. కేబినెట్‌ ఆమోదం, సబ్‌ కమిటీ సిఫారసులతో కాళేశ్వరం కట్టారని బీఆర్‌ఎస్‌ చెబుతుంటే, ఆ ఆధారాలను కాంగ్రెస్‌ సర్కారు ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారని, ఆయన వాస్తవాలను ఆధారాలతో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం డ్రామా అని, అందుకే ఎన్ని కేసులున్నా ఆయన్ను అరెస్ట్‌ చేయడం లేదని సంజయ్‌ విమర్శించారు.

Also Read : Minister Ponguleti: 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతాం – పొంగులేటి

Leave A Reply

Your Email Id will not be published!