Minister Bandi Sanjay : మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రపై కేంద్రమంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఆరు గ్యారంటీలను అమలు చేశామని పాదయాత్ర చేసే దమ్ము కాంగ్రెస్కు ఉందా అని ప్రశ్నించారు...

Bandi Sanjay : పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అయితే కేటీఆర్‌ పాదయాత్ర వార్తలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ ఆయనపై విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా కాంగ్రెస్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు బండి సంజయ్(Bandi Sanjay). శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తా అనడానికి సిగ్గు ఉండాలన్నారు. ఏం ఉద్ధరించారని పాదయాత్ర చేస్తా అంటున్నవ్ కేటీఆర్ అని ప్రశ్నించారు. ‘‘ మేం పాదయాత్ర చేస్తే దాడులు చేశారు. ముందు కేసీఆర్‌ను ఫామ్ హౌస్ నుంచి బయటకు రమ్మను. తాగి, తింటూ కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాయకుడు లేని నావ బీఆర్‌ఎస్. కేటీఆర్‌ను జనం చీధరించుకుంటున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay Comment

ఆరు గ్యారంటీలను అమలు చేశామని పాదయాత్ర చేసే దమ్ము కాంగ్రెస్కు ఉందా అని ప్రశ్నించారు. రైతు భరోసా ఉందో లేదో తెల్వదని. బోనస్ ఇస్తారో లేదో చెప్పరని మండిపడ్డారు. 29 జీవోను రద్దు చేయకపోతే ఊరుకోమని హెచ్చరించారు. ఏడాది పాలనలో ఒక్క హామీ అమలు కాలేదన్నారు. కర్ణాటకలో ఉచిత బస్సు పథకం రద్దు చేస్తున్నారన్నారు. దీపావళికి ఏవో బాంబులన్నారని.. ఇప్పుడు సైలెంట్ అయ్యారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే.. స్కాములన్నీ ఏమయ్యాయో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కాగా.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రజలతో కేటీఆర్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రజలతో సంభాషించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని చెప్పుకొచ్చారు. ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుత తన ముందున్న బాధ్యత అని తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని ప్రకటించారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. పార్టీకి మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని కేటీఆర్ కొనియాడారు.

Also Read : CM Chandrababu : ఉచిత గ్యాస్ అందజేసి అతనే స్వయంగా టీ పెట్టి ఇచ్చిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!