Minister Jaishankar: విభేదాలు… వివాదాలుగా మారకూడదు – చైనాకు కేంద్ర మంత్రి జైశంకర్‌ సూచన

విభేదాలు... వివాదాలుగా మారకూడదు - చైనాకు కేంద్ర మంత్రి జైశంకర్‌ సూచన

Minister Jaishankar : విభేదాలు ఎప్పుడూ వివాదాలుగా మారకూడదని… అలాగే పోటీ సంఘర్షణగా మారకూడదని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన… ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టియాంజిన్‌ వేదికగా మంగళవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోవాలని, మంచి ఫలితాలు రావాలని కోరుకున్నట్లు చెప్పారు. ఇరుదేశాల విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో జైశంకర్‌ (Minister Jaishankar) మాట్లాడుతూ.. దూరదృష్టితో ఆలోచించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Minister Jaishankar Comments

‘‘అక్టోబర్‌ 2024లో ఇరుదేశాల నేతల సమావేశం జరిగిన తర్వాత నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశలో ముందుకు సాగుతున్నాయి. బాధ్యతాయుతంగా మన రెండు దేశాలు దానిని కొనసాగించాలి. ఇటీవల కాలంలో పలు అంతర్జాతీయ వేదికల్లో కలిసేందుకు, వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు అవకాశం లభించింది. ఇలా క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరస్పరం చర్చించుకుంటే రెండు దేశాలకూ మేలు జరుగుతుందని భారత్‌ ఆశిస్తోంది. భారత్‌, చైనా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తవుతుంది. ఐదేళ్ల విరామం తర్వాత ప్రఖ్యాత మానసరోవర్‌ యాత్ర పునఃప్రారంభమైనందుకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో చైనాకు కృతజ్ఞతలు చెబుతున్నా.

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో గత 9 నెలల్లో కీలక పురోగతి సాధించాం. సరిహద్దు వెంబడి ఘర్షణ వాతావరణం లేకుండా చర్యలు తీసుకున్నాం. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఉద్రిక్తతలను తగ్గించడంతో సహా సరిహద్దుకు సంబంధించిన ఇతర అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అర్థికంగా రెండు బలమైన దేశాలు కలిసి ముందుకు వెళ్తే.. త్వరితగతిన అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. భారత్‌, చైనా మధ్య స్థిరమైన సంబంధాలు ప్రపంచానికే మేలు చేస్తాయి.’’ అని జై శంకర్‌ తెలిపారు.

మంగళవారం జరగనున్న ఎస్‌సీవో సమావేశంలో ముఖ్యంగా తీవ్రవాదం, వేర్పాటువాదం, ఉగ్రవాదం అనే అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని జైశంకర్‌ (Minister Jaishankar) పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్న కృతనిశ్చయంతో భారత్‌ ఉందని పునరుద్ఘాటించారు. విదేశాంగశాఖ మంత్రిగా ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత వాంగ్‌ యీ పైనా ఉందని జైశంకర్‌ తెలిపారు. నిర్మాణాత్మకమైన, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌సీవోలో చర్చలు సాగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Also Read : Nimisha Priya: కేరళ నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష ! ‘బ్లడ్‌ మనీ’ని వాళ్లు అంగీకరిస్తారా?

Leave A Reply

Your Email Id will not be published!