Minister Kandula Durgesh: విశాఖలో హరిత హోటల్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖలో హరిత హోటల్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

Kandula Durgesh: ఏడాది కాలంలో పర్యాటక రంగంలో దాదాపు 12,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక కట్టడాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) వెల్లడించారు. శనివారం విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని అప్పుఘర్ వద్ద ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకొని పర్యాటకుల సౌకర్యార్థం సిద్ధమైన హరిత హోటల్(యాత్రినివాస్) ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. యాత్రి నివాస్ లో జరిగిన పనులను, ఏసీ సూట్‌, ఏసీ డీలక్స్‌, ఏసీ ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లు, మీటింగ్ హాల్ ను, బార్ అండ్ రెస్టారెంట్ ను పరిశీలించారు. పర్యాటక శాఖ అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడారు. అంతకుముందు ఆర్కే బీచ్ దగ్గర టూరిజం సీఆర్ వో కౌంటర్ ను మంత్రి దుర్గేష్ (Kandula Durgesh) ప్రారంభించారు. తద్వారా పర్యాటకులు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు ప్రయాణించే హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సుల టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. అనంతరం సెప్టెంబర్ 5-7 వరకు జరగనున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ – 2025 బ్రోచర్ ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీడీసీ పరిధిలోని హోటళ్లు, రిసార్ట్స్ లలో సరైన వసతి సౌకర్యాలు ఉండేలా మరింత ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అంతేగాక కొన్ని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం హబ్, టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ విధానంలో పర్యాటకాభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని ఈ క్రమంలో అనేక సంస్థలకు ఆహ్వానం పలికామన్నారు. తద్వారా పర్యాటకులు రెండు మూడు రోజులు పర్యాటక ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Kandula Durgesh – సకల సౌకర్యాలతో యాత్రినివాస్ సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్

పర్యాటకుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విశాఖ నగర సమీపాన విశాలమైన ప్రాంతంలో 41 రూమ్స్ తో పాటు బార్ అండ్ రెస్టారెంట్, మీటింగ్ హాల్ తో ఉన్న హరిత హోటల్ (యాత్రి నివాస్) ను రూ.13.5 కోట్లతో ఆధునికీకరించామన్నారు. యాత్రినివాస్ ను హరిత రిసార్ట్స్ గా ఆధునికీకరించడం ద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చని భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఆధునికీకరించిన యాత్రినివాస్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు మంత్రి కందుల దుర్గేష్.

బీచ్ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా వీటిని నిర్మించామన్నారు. ఇవి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. యాత్రి నివాస్ పై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆధునికీకరించిందన్నారు. తద్వారా యాత్రికులను ఆకట్టుకుంటున్నామన్నారు. 5 స్టార్ హోటల్ మాదిరి కట్టే పరిస్థితిలో ప్రభుత్వం దగ్గర డబ్బు లేనందున పీపీపీ విధానంలో ఇన్వెస్టర్లను ఆహ్వానించామన్నారు. ల్యాండ్ పార్సల్ ఇస్తే భారీ హోటల్లు నిర్మిస్తామని పలువురు ముందుకొస్తున్నారన్నారు.

Kandula Durgesh – శరవేగంగా టైడా, జంగిల్ బెల్స్ ఆధునికీకరణ పనులు – మంత్రి దుర్గేష్

టైడా, జంగిల్ బెల్స్ ను ప్రత్యక్షంగా సందర్శించిన అనంతరం గత ప్రభుత్వం సరైన దృష్టి పెట్టని కారణంగా అక్కడ చెక్కతో చేసిన నిర్మాణాలు పడిపోతుండటం గమనించామన్నారు. గడిచిన ఐదేళ్లలో ఆ ప్రాంతం నాశనమైందన్నారు. ప్రస్తుతం టైడా జంగిల్స్ బెల్స్ ను అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. టైడాలో అటవీ శాఖ తమకు కూడా రెవెన్యూలో భాగం ఉండాలన్న ప్రతిపాదనతో ఆధునికీకరణ అంశం ఆలస్యమైందన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు అటవీ, పర్యాటక, దేవాదాయ, జలవనరుల శాఖలతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలతో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికే టైడా విషయమై అటవీ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించామని, తమకు రెవెన్యూ అవసరం లేదని పర్యాటక శాఖను అభివృద్ధి చేయమని సూచించారని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో టైడా ఆధునికీకరణ పనులు వేగవంతం చేశామన్నారు.గతంలో ఈ తరహా సమన్వయం లేకపోవడం వల్ల 23 కాటేజీలు కాస్త 10కి పడిపోయాయన్నారు. నిర్మాణాల ప్రక్రియకు కొంత సమయం పడుతుండటంతో ఈలోపు మిగతా సమస్యలు పరిష్కరించుకున్నామన్నారు.ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక అంశాలతో పాటు పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టులకై కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్ జెడ్) అనుమతులకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో ఈ అంశంపై మాట్లాడుతామన్నారు.

Kandula Durgesh – పర్యాటకుల గమ్యస్థానంగా విశాఖ – మంత్రి కందుల దుర్గేష్

ఏపీ పర్యాటక రంగం అనగానే ముందుగా విశాఖపట్టణం గుర్తొస్తుందని మంత్రి దుర్గేష్ (Kandula Durgesh) అన్నారు. విశాఖకు వచ్చే పర్యాటకుడు అరకువ్యాలీ, సింహాచలం, అరసవల్లి, స్థానికంగా ఉండే ప్రాంతాలు చూసేలా సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానికంగా స్టార్ హోటళ్ల ఏర్పాటు కోసం ఇప్పటికే ఒబెరాయ్, మేఫేర్, ఐఆర్ సీటీసీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. నోవాటెల్ తదితర హోటళ్లు మరింత అభివృద్ధికి ముందుకు వస్తున్నాయన్నారు. విశాఖలో అరకువ్యాలీ లాంటి కనువిందైన ప్రాంతాలున్నాయని తెలిపారు.

టూరిజం ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేలా విశాఖ బీచ్ రోడ్డులో నడిపే రెండు హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. 14 టూరిస్ట్ పాయింట్లు పర్యాటకులు సందర్శించేలా ప్రణాళిక చేశామన్నారు. మొదట్లో రూ.500 టికెట్ ధర ఉండాలని నిర్ణయించామన్నారు. కానీ సీఎం చంద్రబాబునాయుడు పెద్దలకు రూ.250, చిన్న పిల్లలకు రూ.100 టికెట్ ధర ఉంచాలని ఆదేశించారన్నారు. తద్వారా ఉదయం రూ.250 టికెట్ తీసుకున్న పర్యాటకులు రోజంతా బస్సులో ప్రయాణించవచ్చన్నారు. ఇతర దేశాల, రాష్ట్రాల పర్యాటకులు సైతం రాష్ట్రానికి వచ్చేలా ఏపీని పర్యాటకుల గమ్యస్థానంగా మారుస్తున్నామన్నారు.

Kandula Durgesh – పర్యాటక ఆదాయం కొల్లగొట్టి రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం – మంత్రి  దుర్గేష్

శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), జనసేన (Janasena) ప్రజాప్రతినిధులతో కలిసి రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక శాఖకు ఏటా రూ.7 కోట్ల ఆదాయం వచ్చే హరిత రిసార్ట్స్ స్థానంలో గత ప్రభుత్వం రూ.434 కోట్లతో రుషికొండ ప్యాలెస్ ను నిర్మించడం వల్ల తద్వారా పర్యాటక ఆదాయం కోల్పోయామన్నారు. వృధాగా పడి ఉన్న రుషికొండ ప్యాలెస్ కు కరెంట్ చార్జీల రూపంలో రూ.కోటి బకాయి పడ్డామన్నారు. రాష్ట్రంలో ఏపీటీడీసీకి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిన హరిత రిసార్ట్స్ ను పడగొట్టడం దుశ్చర్య అన్నారు.పర్యావరణాన్ని విధ్వంసం చేసి హరిత రిసార్ట్స్ స్థానంలో వీటిని నిర్మించడం మూలాన గత ప్రభుత్వ పాపాలు తమకు శాపాలుగా మారాయన్నారు.

Kandula Durgesh – కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి – మంత్రి కందుల దుర్గేష్

కేంద్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి ఇతోధికంగా సాయం చేస్తుందన్నారు. ఇప్పటికే శాస్కి ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టు,గండికోట, స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా ప్రసాద్ సూర్యలంక బీచ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. తద్వారా అన్నవరం, సింహాచలం క్షేత్రాలను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 1/70 చట్టానికనుగుణంగా తాము గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. లంబసింగి, వంజంగిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక అభివృద్ధికి బీజం వేశామన్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించి ముందుకు వెళ్తున్నామన్నారు.లంబసింగిలో నిర్మాణాలు ప్రారంభమయ్యాయని త్వరలోనే పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. రంప ప్రాంత పర్యాటకాభివృద్ధికి ప్రతిపాదనలు పంపించామని అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యం – మంత్రి కందుల దుర్గేష్

వైసీపీ పాలనలో పర్యాటక రంగం పూర్తిగా నిరాదరణకు గురైందని, ఈ రంగాన్ని నిర్వీర్యం చేశారని మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా విమర్శించారు.గత ప్రభుత్వం పర్యాటక రంగంపై తగిన దృష్టి సారించకపోవడం వల్ల రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గాయని ఆయన ఆరోపించారు. పర్యాటక రంగంలోని అపార సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా, వైసీపీ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రం అనేక అవకాశాలను కోల్పోయిందని ఆయన అన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంలో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సూచనల మేరకు, ఎలాంటి అవకాశాలనూ వదిలిపెట్టకుండా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పునరుద్ధరించి, ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, నగర మేయర్ పీలా శ్రీనివాస్ రావు, కార్పొరేటర్లు, టూరిజం శాఖ సీఈ వెంకటరమణ, ఎస్ ఈ ఈశ్వరయ్య, రీజినల్ డైరెక్టర్ జివీబీ జగదీష్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయమాధవి, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read : Telangana Floods: తెలంగాణలో 2 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం

Leave A Reply

Your Email Id will not be published!