Minister Kollu Ravindra: జగన్, పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

జగన్, పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

Kollu Ravindra : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పల హరిక కారును వదిలేశామని తెలిపారు. కానీ తర్వాత ఆమె కావాలని వెనక్కి వచ్చి పోలీసులపై, తెలుగుదేశం నాయకుల గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని స్థానికులే చెబుతున్నారని అన్నారు. జగన్, పేర్ని నానిలాంటి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

రాక్షస మూకలకు రాక్షస ఆలోచనలే వస్తాయని జగన్‌‌, పేర్నినాని మరోసారి నిరూపించారని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మండిపడ్డారు. మాజీ మంత్రి వివేకా హత్యలో జగన్‌ (YS Jagan) పై ఆరోపణలు వచ్చాయని అన్నారు. వివేకాది గుండెపోటు కాదని… గొడ్డలి వేటు అని ఆయన కుమార్తె తేల్చిందని గుర్తుచేశారు. జగన్ ప్రతి విషయంలో రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ సభ పెట్టుకోవాలనుకున్నావ్. పెట్టుకో….. అంతే గానీ ఆ సభను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో రక్తం పారిస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని జగన్‌‌, పేర్నినానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Kollu Ravindra – పేర్నినాని రెచ్చగొడుతున్నారు – ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

బావ కళ్లల్లో ఆనందం చూడాలని ఆ నాడు మొద్దు శ్రీను పరిటాల రవిని చంపితే… ఇప్పుడు జగన్ రెడ్డి కళల్లో ఆనందం చూడాలని పేర్ని నాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మండిపడ్డారు. ఆదివారం కృష్ణప్రసాద్ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేదని ప్రశ్నించారు. పేర్ని నాని పేదల బియ్యం దోచుకున్నారని ఆరోపించారు. చీకటిలో చంపేయండి… నరికేయండి అని వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. పేర్ని నాని ఎవరిని చంపుతారు.. టీడీపీ కార్యకర్తలనా? అని నిలదీశారు. గత వైసీపీ పాలనలో హింస రాజకీయం చేశారని… ఇప్పుడు అలానే చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ సైకో పాలన చూసి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని… అయినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు.

మాజీ మంత్రి పేర్ని నానిపై మరో కేసు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై (Perni Nani) విజయవాడలో ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేర్ని నానిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని మైనార్టీ నేతలు కోరారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సైగా చేస్తే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్తంభానికి కట్టేసి పేర్ని నానిని కొడతామని ఫతావుల్లా, ఆషాలు హెచ్చరించారు. ఇంకోసారి రెచ్చగొట్టే మాటలు పేర్ని నాని మాట్లాడకుండా గుణపాఠం చెబుతామని మైనార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు.

కొల్లు రవీంద్రకి పేర్ని కిట్టు స్ట్రాంగ్ వార్నింగ్

మంత్రి కొల్లు రవీంద్రపై మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి పేర్ని కిట్టు మండిపడ్డారు. ‘ఉప్పాల హారికపై దాడి జరిగితే కొల్లు రవీంద్ర ఆ దాడిని సమర్ధించడం సిగ్గుచేటు. మంత్రి కొల్లు రవీంద్రను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మీ కుటుంబ సభ్యులతో కారులో వెళుతుంటే ఎవరైనా దాడి చేస్తే మీరు ఇలాగే మాట్లాడతారా? తన భార్యను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏ భర్త అయినా ఎలా స్పందిస్తాడో ఉప్పాల రాము కూడా అలాగే స్పందించాడు. హారిక కంట్లో కారిన ప్రతీ కన్నీటి చుక్కకు దేవుడు.. కాలమే సమాధానం చెబుతాడు. ఉప్పాల హారికకు ఏ కష్టం వచ్చినా మేం అండగా ఉంటాం. మమ్మల్ని దాటుకునే ఎవరైనా మీ వరకూ రావాలి’అని స్పష్టం చేశారు.

Also Read : Ujjaini Mahankali Bonalu: వైభవంగా సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాలు ! తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు !

Leave A Reply

Your Email Id will not be published!