KTR MLC Kavitha : ఈడీ స‌మ‌న్లు కాదు మోదీ స‌మ‌న్లు

నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్

KTR MLC Kavitha : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న సోద‌రి , ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. చ‌ట్టాల ప‌ట్ల త‌మ‌కు గౌర‌వం ఉంద‌ని, తాము కూడా ఎలా ఎదుర్కోవాలో తెలుస‌ని అన్నారు.

ఈడీ స‌మ‌న్లు ఇవ్వ‌లేద‌ని దాని వెనుక ఉన్న ప్ర‌ధాని మోదీ స‌మ‌న్లు ఇచ్చేలా చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్. త‌న సోద‌రికి ఇచ్చిన స‌మ‌న్ల‌పై తొలిసారిగా కేటీఆర్ స్పందించ‌డం విశేషం. బీఆర్ఎస్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 11 మందిపై దాడులు చేశార‌ని ఆరోపించారు. కానీ ఏ ఒక్క‌టి క‌నుక్కోలేక పోయార‌ని మండిప‌డ్డారు.

ఇవాళ దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోయింద‌ని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ఒక్క‌టి మాత్ర‌మే ఉండాల‌ని మిగ‌తా ప్ర‌తిప‌క్షాలు ఉండ కూడ‌ద‌నే ల‌క్ష్యంతో దాడులకు దిగుతున్నారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. ఈ తొమ్మిది సంవ‌త్స‌రాల పాల‌న‌లో దేశానికి ఏం చేశారో చెప్పాల‌ని నిల‌దీశారు మంత్రి. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం త‌ప్ప ఒక్క మంచి ప‌ని కూడా చేసిన పాపాన పోలేద‌న్నారు .

విచార‌ణ పేరుతో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వేధించ‌డం ప‌నిగా పెట్టుకున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌లో కొన‌సాగుతూ వ‌స్తున్న‌దేన‌ని అన్నారు కేటీఆర్(KTR MLC Kavitha). ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థ‌ల‌ను పావుగా వాడుకుంటున్నాయ‌ని త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్ప‌క త‌ప్ప‌ద‌న్నారు. త‌న సోద‌రి క‌విత ఈనెల 11న ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

Also Read : 10న ఢిల్లీలో ఎమ్మెల్సీ క‌విత దీక్ష

Leave A Reply

Your Email Id will not be published!