Minister Nadendla Manohar: రేష‌న్ మాఫియాపై ఉక్కుపాదం మోపాం – మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్

రేష‌న్ మాఫియాపై ఉక్కుపాదం మోపాం - మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్

Nadendla Manohar : కూట‌మి ప్ర‌భుత్వ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చామ‌ని, ప్ర‌జ‌లు మెచ్చుకునే రీతిలో సేవ‌ల‌ను విస్త‌రించామ‌ని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ (Nadendla Manohar) పేర్కొన్నారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ లో పౌర సరఫరాల శాఖ పనితీరుపై ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మాట్లాడుతూ… ఏడాది కాలంలో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు అందాల్సిన రేష‌న్ బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌డాన్ని గుర్తించి క‌ట్టిడి చేశామ‌ని, త‌ప్పు చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించామ‌ని పేర్కొన్నారు. చ‌ట్టంలో మార్పులు తీసుకొచ్చామ‌ని గుర్తు చేశారు.

విజిలెన్స్ త‌నిఖీల‌ను పెంచామ‌ని, లీగ‌ల్ మెట్రాల‌జీ కార్య‌క‌లాపాల‌ను విస్తృతం చేశామ‌ని వెల్ల‌డించారు. అద‌నంగా ఆర్థిక భారం ప‌డుతున్న‌ప్ప‌టికీ రేష‌న్ దుకాణాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మందికి రేష‌న్ స‌ర‌కులు అంద‌జేస్తున్నామ‌ని, దీపం-2 ప‌థ‌కంలో భాగంగా కోటి మందికి ల‌బ్ధి చేకూరుస్తున్నామ‌ని పేర్కొన్నారు. నెల‌లో 15 రోజుల రేషన్ దుకాణాల ద్వారా నాణ్య‌మైన స‌ర‌కులు అందిస్తున్నామ‌ని, 65 ఏళ్లు దాటిన వృద్ధుల‌కు, విక‌లాంగుల‌కు నెలాఖ‌రున ఇంటి వ‌ద్ద‌కే తీసుకెళ్లి రేష‌న్ అంద‌జేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండ‌ర్లు అంద‌జేస్తున్నామ‌ని, రాయితీ సొమ్ము వెనువెంట‌నే జ‌మ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

Nadendla Manohar – పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎన్.టి.ఆర్. జిల్లాలో డిజిట‌ల్ వాలెట్ విధానం

ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌లో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు దేశంలోనే మొద‌టిగా ఎన్.టి.ఆర్. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా డిజిట‌ల్ వాలెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామ‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ (Nadendla Manohar) పేర్కొన్నారు. దీనిలో భాగంగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌కు త‌గ్గ‌ట్టుగా రూ.851 విలువ గ‌ల ప్ర‌త్యేక‌ కూప‌న్ లు ఇస్తామ‌ని, దాని ద్వారా వారు బుకింగ్ చేసుకుంటార‌ని చెప్పారు. ఈ విధానం విజ‌యవంతం అయితే కోటి మందికి డైరెక్టు పేమెంట్ చేసే విధానాన్ని అంతటా అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు.

ఏజెన్సీ ప‌ర్య‌ట‌న‌లో ఎన్నో విష‌యాలు తెలిశాయి

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్ట‌ణం ప‌రిధిలోని ఏజెన్సీ ప్రాంత క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో ఎన్నో విషయాలు మా దృష్టికి వ‌చ్చాయ‌ని పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ (Nadendla Manohar) అన్నారు. పాడేరు, అనంత‌గిరి ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థపై ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. అయితే కొండ‌వాలు ప్రాంతాల్లో రేషన్ దుకాణానికి మూడు కిలో మీట‌ర్ల దూరం దాటిన గ్రామాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయ‌ని, వాటిని అధిగ‌మించేందుకు ఇప్ప‌టికే 69 స‌బ్ డిపోల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట‌మైన స‌మ‌స్య‌లు భ‌విష్య‌త్తులో కూడా ఉద్భవిస్తే ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌మాలోచ‌న‌లు జ‌రిపి చ‌ర్చించిన విధంగా ముఖ్య‌మంత్రి ఆమోదంతో న‌గ‌దు చెల్లింపు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు యోచిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే జీసీసీతో అనుసంధానం అవుతామ‌ని, వివిధ గిరిజ‌న ఉత్ప‌త్తుల‌ను 29,500 రేష‌న్ దుకాణాల ద్వారా త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తామ‌ని చెప్పారు. గిరిజ‌న ఉత్ప‌త్తుల‌కు అంత‌ర్జాతీయ మార్కెటింగ్ క‌ల్పిస్తామ‌ని మంత్రి ఉద్ఘాటించారు.

ఆగ‌స్టు 25న రాష్ట్ర వ్యాప్తంగా పండ‌గ వాతావ‌రణంలో స్మార్ట్ రేష‌న్ కార్డులు పంపిణీ చేస్తాం

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత నాణ్య‌మైన రీతిలో సేవ‌ల‌ను అందించేలా కార్యాచ‌ర‌ణ రూపొందించామ‌ని, దానిలో భాగంగా ఆగ‌స్టు 25వ తేదీన పండగ వాతావ‌ర‌ణంలో స్మార్ట్ కార్డుల‌ను పంపిణీ చేస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. ఇప్ప‌టికే రేషన్ తీసుకుంటున్న అంద‌రితో పాటు కొత్త‌వారికి కూడా ఈ కార్డుల‌ను అంద‌జేస్తామ‌ని చెప్పారు. సాంకేతిక సాయంతో పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తూ ఈ విధానాన్ని అమ‌లు చేస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత నాణ్య‌మైన సేవ‌ల‌ను అందించేందుకు స‌మష్టి కృషి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆయ‌న‌తో పాటు పౌర స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ సౌర‌భ్ గౌర్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, డీసీసీబీ ఛైర్మ‌న్ కోన తాతారావు, జీవీఎంసీ డిప్యూటీ మేయ‌ర్ న‌ల్లి గోవింద‌రెడ్డి పాల్గొన్నారు.

Also Read : CM Chandrababu: పీ-4 మార్గదర్శుల పేరుతో ఎవరినీ బలవంతం పెట్టవద్దు – సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!