Minister Nadendla Manohar: మే నెల నుంచి స్మార్ట్ రేషన్‌కార్డులు మంజూరు – మంత్రి నాదెండ్ల మనోహర్
మే నెల నుంచి స్మార్ట్ రేషన్‌కార్డులు మంజూరు - మంత్రి నాదెండ్ల మనోహర్
Nadendla Manohar : కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) తెలిపారు. కొత్త రేషన్‌కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామన్నారు. ఈ-కేవైసీ పూర్తయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని చెప్పారు.
Nadendla Manohar – వాట్సప్ ద్వారా ధాన్యం విక్రయం
ఖరీఫ్ సీజన్‌లో 35 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతుకు ఒక భరోసా ఇస్తూ వారికి 24 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ చేశామని అన్నారు. రూ.8 వేల 279 కోట్లు ధాన్యం కొనుగోలు చెల్లింపులు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) తెలిపారు. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని చెప్పారు. వాట్సప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. వాట్సప్ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
రబీలో 13 లక్షలు 50 వేల మెట్రిక్ టన్నులు పంట వస్తుందని అంచనా వేశామని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. సివిల్ సప్లై నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 2900 రైతు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 12 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.
మంగళవారం నుంచి దీపం 2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు దీపం 2 పథకం అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధార్‌తో ఈ కెవైసీ లింక్ చేసుకోవాలని చెప్పారు.
జగన్ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి
గత జగన్ ప్రభుత్వం రూ.1600 కోట్లతో ఎండీయూలు కొనుగోలు చేసి దుర్వినియోగం చేసిందని ఆరోపణలు చేశారు. ఎండీయూల కొనుగోలు ఓ పెద్ద కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని.. త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో కూడా అవినీతి జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతులు ధాన్యాలను అమ్ముకునేందుకు మిల్లుల వద్ద పడిగావులు కాయాల్సి వచ్చే పరిస్థితి ఉందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లల్లో వాట్సాప్ , జీపీఎస్‌లను సాంకేతికంగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. రైతులే వారికి నచ్చిన మిల్లుల వద్ద ధాన్యం అమ్ముకునేలా అవకాశం కల్పించామని చెప్పారు. ఈ సీజన్‌లో చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని మాటిచ్చారు.
Also Read : Rape in Hyderabad: జర్మనీ యువతిపై హైదరాబాద్‌లో అత్యాచారం