Minister Nadendla Manohar: ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ – మంత్రి నాదెండ్ల మనోహర్‌

ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ - మంత్రి నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar : రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్‌ రేషన్‌కార్డులు (Ration Cards) పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా క్యూఆర్‌ కోడ్‌తో ఈ కార్డులను రూపొందించినట్లు తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ రేషన్ కార్డులని పంపిణీ చేస్తోందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 60శాతం, ఏపీ ప్రభుత్వం 40శాతం కార్డులను భరిస్తున్నాయని వెల్లడించారు. 4.72 శాతం రేషన్ కార్డు దరఖాస్తులు తిరస్కరించగా… నేటి వరకూ ఏపీవ్యాప్తంగా కోటి 40 లక్షల 96 వేల 86 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.

Minister Nadendla Manohar Key Updates

మంగళవారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదేండ్ల (Nadendla Manohar) మాట్లాడుతూ… ‘‘కొత్తగా 9లక్షల మందికిపైగా రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలోని 29,796 రేషన్‌ షాపుల్లో ప్రతినెలా 1 నుంచి 15 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్యం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 వరకు రేషన్‌ సరఫరా చేస్తున్నాం. ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ అక్కర్లేదు’’అని తెలిపారు. పాత విధానాన్ని మార్చి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజ్ చేశామని వెల్లడించారు. ఈ కార్డులపై ఎక్కడా నాయకుల ఫొటోలు ఉండకుండా డిజైన్ చేశామని తెలిపారు. కుటుంబసభ్యుల ఫొటోలు మాత్రమే రేషన్ కార్డులో ఉంటాయని… వీటిని డెబిట్, క్రెడిట్ కార్డు సైజుల్లో ఇవ్వబోతున్నామని ప్రకటించారు. కుటుంబసభ్యుల వివరాలు, కార్డునంబర్ బాగా కనిపించేలా రూపొందించామని వెల్లడించారు.

Nadendla Manohar – ఉచితంగా కార్డులు అందిస్తాం – మంత్రి మనోహర్

క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే సెంట్రల్ ఆఫీసులో తెలుస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. ఈ కార్డులు అన్ని ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఆగష్టు 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ఈ కార్డులు అందిస్తామని ప్రకటించారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇస్తారని, రాష్ట్రస్ధాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్డులు పంపిణీ చేస్తారని వెల్లడించారు. 94శాతం మందికి ఈ-కేవైసీ చేశామని తెలిపారు. ఏపీవ్యాప్తంగా 29,786 రేషన్ షాపుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు… అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ ఇవ్వాలని ఆదేశించారు. 65 సంవత్సరాల దాటిన వృద్ధులకు ప్రతి నెలా 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య సరకులు హోమ్ డెలివరీ చేస్తామని వెల్లడించారు. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మినహా అన్నిచోట్ల పంపిణీ బాగానే జరుగుతోందని చెప్పుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఇబ్బందులను స్వయంగా తామే వెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.

ఆయిల్ కంపెనీలతో ప్రతి వారం సమీక్షలు

దీపం పథకంలో ఎలాంటి లోపం లేకుండా మూడు ఆయిల్ కంపెనీలతో ప్రతి వారం సమీక్షలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వ్యాఖ్యానించారు. దీపం పథకం రెండో విడతలో భాగంగా నేటి వరకూ 93లక్షల 86వేల మందికి డెలివరీలు పంపిణీ చేశామని తెలిపారు. దీపం-2 పథకాన్ని లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీ లోపు వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై డైరెక్ట్‌గా వినియోగదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి 4,281 మంది లబ్ధిదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా డిజిటల్ వ్యాలెట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ దీపం పథకాన్ని 30శాతం మంది ఉపయోగించుకున్నారని గుర్తుచేశారు. 2,580 మంది లబ్ధిదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

దీపం పథకంలో 86వేల మంది లబ్ధిదారుల అకౌంట్లు సక్రమంగా లేకపోవడంతో వారికి డబ్బులు పడలేదని… వారి వివరాలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 4,516 ట్రాన్సాక్షన్‌లు మాత్రమే ఫెయిల్ అయ్యాయని తెలిపారు. వేర్వేరు బ్యాంకు అకౌంట్లు, ఫోన్ నంబర్లు వేరే ఉండటంతో డబ్బులు పడలేదని చెప్పుకొచ్చారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కింద గ్యాస్ ఏజెన్సీకి మాత్రమే ఆ కూపన్ చెల్లుతుందని… దీంతో వ్యాలెట్‌లోని పైసలు వేరే అవసరాలకు వాడటానికి వీలుండదని స్పష్టం చేశారు. 86 వేల మంది లబ్ధిదారులని గుర్తించడం చాలా కష్టం అయిందని… అయితే అర్హత ఉన్నవారికి నూటికి నూరుశాతం అందజేస్తామని హామీ ఇచ్చారు. చివరి నిమిషంలో గ్యాస్ బుకింగ్ చేసుకోవడం వల్ల కూడా డబ్బులు పడే అవకాశం లేదని… కాబట్టి ముందే బుక్ చేసుకోవాలని సూచించారు. ఏపీలో అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ఓ అర్హతగా ఉందని తెలిపారు.

ప్రమోషన్ చేస్తే తప్పేంటి – మంత్రి నాదెండ్ల మనోహర్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాబట్టే హరిహర వీరమల్లు సినిమాను తాము ప్రమోట్ చేస్తామని… అది తమ బాధ్యతని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. తమ సినిమాలను తాము ప్రమోట్ చేయకుండా… వారి సినిమాలను ప్రమోట్ చేస్తామా? అని ప్రశ్నించారు. సినిమాకు ప్రమోషన్ చేస్తే తప్పేంటని నిలదీశారు. తమ సినిమాని తాము ప్రమోషన్ చేసుకుంటామని స్పష్టం చేశారు. సినిమా ప్రమోషన్‌కి మంత్రుల స్థాయి అనేది అనవసరమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Also Read : YS Jagan: కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ – వైఎస్ జగన్‌

Leave A Reply

Your Email Id will not be published!