Minister Nara Lokesh: తమిళనాడు బీజేపీ నేత అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ

తమిళనాడు బీజేపీ నేత అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ

Nara Lokesh : తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం భేటీ అయ్యారు. ఇండియా టుడే నిర్వహించిన సౌత్ ఇండియా కాన్ క్లేవ్ లో పాల్గొనడానికి కోయంబత్తూరు వెళ్ళిన మంత్రి నారా లోకేష్ కుమిళనాడు బీజేపీ నేతలు అన్నామలై, అమర్ ప్రసాద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో సమావేశం అయిన మంత్రి లోకేష్ (Nara Lokesh) పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

Minister Nara Lokesh Meet

డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నందున ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని తెలిపారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాలని అన్నామలైని (Annamalai) ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్‌.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)… కోయంబత్తూరు ఎయిర్ పోర్టులో తమిళనాడు బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి, అక్కడి తెలుగు ప్రజలు నాపై చూపిన ఆత్మీయత, అభిమానం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ తర్వాత కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించాను. ప్రస్తుతం ఏపీలో పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నాం. పరిశ్రమదారులు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే. రాష్ట్రంలో పెద్దఎత్తున వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) గారి నేతృత్వంలో ఆంధ్రపదేశ్ లాజిస్టిక్ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిశ్రమ అనుకూల విధానాల వల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పిలుపునిచ్చాను అని తన అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు.

నూతన జాతీయ విద్యావిధానానికి లోకేశ్‌ మద్దతు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సమర్థించారు. ‘ఇండియా టుడే సౌత్‌ కాన్‌క్లేవ్‌ 2025’ లో మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని చెబుతున్నప్పటికీ ఎక్కడా హిందీ తప్పనిసరి అని చెప్పలేదని అన్నారు. ‘నేను దిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశాను. మాతృభాషలో బోధనపై దృష్టిపెట్టాలని ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక భారతీయుడిగా మాతృభాష ప్రాధాన్యం నాకు తెలుసు. అలాగే హిందీ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

తన సొంత అనుభవాన్ని లోకేశ్‌ వివరిస్తూ తాను కూడా మూడు భాషలు నేర్చుకున్నానని వెల్లడించారు. ‘నేను మూడు భాషలు నేర్చుకున్న విద్యార్థిని. నా కుమారుడు కూడా అదే పని చేస్తున్నారు. ఇవాళ పిల్లలు ఐదు భాషలు నేర్చుకుంటున్నారు. జర్మన్‌, జపనీస్‌ ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే ఆ దేశాల్లో పని చేయడానికి వీలవుతుంది’ అని వివరించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దక్షిణాది భాషలు నేర్చుకోవాలా? అని ప్రశ్నించగా ‘ఎందుకు నేర్చుకోకూడదు? ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఒడియా, తమిళ్‌, కన్నడ మాధ్యమాల్లో బోధించమని ఆదేశాలు జారీ చేస్తున్నాం. పిల్లలు తాము కోరుకునే భాష నేర్చుకోవాలి. రాజకీయ నిర్ణయాల ఆధారంగా అది జరగకూడదు’ అని పేర్కొన్నారు.

Also Read : YV Subba Reddy: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన వైవీ సుబ్బారెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!