Minister Nara Lokesh: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై ‘ఎన్‌ విడియా’తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై ‘ఎన్‌ విడియా’తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Nara Lokesh : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ఏఐ కంప్యూటింగ్‌ సంస్థ ‘ఎన్‌ విడియా’తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఉన్నత విద్య అధికారులు, ఎన్‌ విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా 10వేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీనితోపాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్‌ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు.

Minister Nara Lokesh

గతేడాది అక్టోబర్‌ లో మంత్రి లోకేశ్‌(Nara Lokesh)… ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌ తో ముంబయిలో సమావేశమై అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకరించాల్సిందిగా కోరారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు. ఏఐ యూనివర్సిటీకి అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లు, హార్డ్‌వేర్ సామర్థ్యాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యా రంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదికగా మారనుంది. విద్యార్థులకు ప్రాజెక్ట్‌లు, పరిశోధన, మార్కెట్ అవకాశాలు, మెంటార్‌షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించనున్నారు. ఏపీని దేశంలోనే అడ్వాన్స్‌డ్ ఏఐ రీసెర్చ్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు కానుంది.

ఇకపై ఏటా డీఎస్సీ – మంత్రి నారా లోకేశ్‌

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ చేపట్టామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) తెలిపారు. పకడ్బందీగా పరీక్షలు ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు చెప్పారు. ‘‘రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసి విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తాం. అంతిమంగా రాబోయే నాలుగేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే లక్ష్యం’’ అని దిశానిర్దేశం చేశారు. పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించామన్నారు. మొట్టమొదటి సారిగా నాలుగు వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామని గుర్తు చేశారు. నూరుశాతం అక్షరాస్యత కోసం ప్రాజెక్ట్ అ-ఆ (అక్షర ఆంధ్ర) ప్రారంభించినట్లు వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేశ్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

Also Read : AP Government: టెన్త్, ఇంటర్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ‘షైనింగ్‌ స్టార్‌’ అవార్డులు

Leave A Reply

Your Email Id will not be published!