Minister Nara Lokesh: సింగపూర్ పర్యటనతో ఏపీకు 45వేల కోట్ల రూపాయల పెట్టుబడులు – మంత్రి నారా లోకేశ్
సింగపూర్ పర్యటనతో ఏపీకు 45వేల కోట్ల రూపాయల పెట్టుబడులు - మంత్రి నారా లోకేశ్
Nara Lokesh : సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతమైందని, ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. గురువారం సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. తాము ఎంవోయూలు చేయట్లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని జూమ్‌కాల్ ద్వారా ఆర్సెల్లార్ మిత్తల్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, డేటా సెంటర్‌లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడించారు.
‘‘2019-24 మధ్య ఏపీ బ్రాండ్‌ను జగన్ నాశనం చేశారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ కోరింది. ఆ దేశ ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా గత ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసింది. పారదర్శకతలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్ర వేశారు. అమర్‌రాజా, లులు సహా పలు కంపెనీలను జగన్ తరిమేశారు. కానీ, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, ఏపీకి చంద్రబాబు ఉన్నారు. ఐటీ పటంలో విశాఖను పెట్టాలని నిర్ణయించుకున్నాం.
Nara Lokesh – హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు కానీ టీసీఎస్‌కు ఇచ్చాం
ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99పైసలకే భూమి కేటాయించాం. దీనిపై వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు. తక్కువ ధరకు భూముల్ని మేం హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు… టీసీఎస్‌కు ఇచ్చాం. ఉద్యోగాలు వస్తాయని రూ.99పైసలకే భూములు ఇస్తున్నాం. అందులో తప్పేంటి? వైసీపీ తెచ్చిన పెట్టుబడులకంటే మా ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ.
పెట్టుబడులు రాకుండా ఈ-మెయిల్ పంపించారు
ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ అధికారులకు మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపించారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని అందులో పేర్కొన్నారు. మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సంబంధాలున్నాయి. పెట్టుబడుల కోసం తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే కలిసికట్టుగా పనిచేస్తాయి. ఏపీలో మాత్రం పెట్టుబడులు రాకుండా కంపెనీలకు వైసీపీ లేఖ రాస్తుంది. ఇలా లేఖలు పంపితే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారు?ఇలా చేస్తే నష్టపోయేది తెలుగువారే’’అని మంత్రి లోకేశ్ అన్నారు.
Also Read : TTD: రీల్స్ చేసే వారికి టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్
