Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికోసం అహర్నిశలు పనిచేస్తా – మంత్రి నారా లోకేశ్‌

మంగళగిరి అభివృద్ధికోసం అహర్నిశలు పనిచేస్తా - మంత్రి నారా లోకేశ్‌

 

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ప్రత్యేక పర్యటనలో భాగంగా రెండో రోజు… ఉండవల్లిలో ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమం చేపట్టారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసారు. ఈ రోజు నుంచి ఈ నెల 12వ తేదీ వరకు నియోజకవర్గంలో ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమం జరుగనుంది. యర్రబాలెం గ్రామానికి చెందిన 248మందికి శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. అలాగే నీరుకొండ గ్రామానికి చెందిన 99మందికి, రత్నాల చెరువుకు చెందిన 199మందికి… మొత్తంగా 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను నారా లోకేష్ ఉచితంగా అందజేసారు. నారా లోకేశ్ తన సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… ‘‘మంగళగిరి ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా. సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నాను. ‘ఎన్టీఆర్‌ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్‌ లు ఏర్పాటు చేశాం. దుగ్గిరాలలోనూ మొబైల్‌ క్లినిక్‌ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం. నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాం. నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టుమిషన్లు అందజేశాం’’ అని మంత్రి లోకేశ్‌ వివరించారు.

అలాగే మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు పదినెలల్లో పరిష్కారం చూపామని అన్నారు. తొలి విడతలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న మూడు వేలమందికి శాశ్వత పట్టాలు అందజేస్తామని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన మంగళగిరిలో వందపడకల ఆస్పత్రికి భూమి పూజ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 13వ తేదీకి ప్రారంభిస్తామని అన్నారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకోటగా మారుస్తామని సీఎం చంద్రబాబుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మంగళగిరి పేదలకు ఇంటి పట్టాల పంపిణీ రెండున్నర దశాబ్దాల కల అని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పదినెలల్లో ఇంటిపట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. తమకు ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయి వేసి ఆలోచించుకోవాలని చెప్పారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

 

Leave A Reply

Your Email Id will not be published!