Minister Nara Lokesh: ఇంట్లో ‘నాన్న’, పనిలో ‘బాస్‌’- చంద్రబాబుకు లోకేశ్ విషెస్‌

ఇంట్లో ‘నాన్న’, పనిలో ‘బాస్‌’- చంద్రబాబుకు లోకేశ్ విషెస్‌

Nara Lokesh : ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు కావస్తున్న సందర్భంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. హైటెక్ సిటీ నుంచి క్వాంటం వ్యాలీ వరకూ సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వమని కొనియాడారు. బయోటెక్ ఆకాంక్షల నుంచి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు ఈ పురోగతే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నాన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Minister Nara Lokesh Comments

‘‘ఇంట్లో ‘నాన్న’, పనిలో ‘బాస్’ అని పిలుచుకునే అదృష్టం నాకు లభించింది. పాలనకు సాంకేతికతను జోడించి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వరకూ ప్రయాణం సాగింది. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగారు. హైటెక్ సిటీ, జినోమ్ వ్యాలీ కొత్త సాంకేతిక గుర్తింపును శక్తిమంతం చేశారు. అమరావతి నిర్మాణం వరకు ఆయన నాయకత్వం ఎన్నో ఆవిష్కరణలకు మైలురాయి. వేగం, జవాబుదారీతనం, మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా ఆధారిత సేవలు, పౌరులు, సంస్థలను శక్తిమంతం చేసే వేదికలతో సరికొత్త ఒరవడి సృష్టించారు. చంద్రబాబు పదవీకాలం సామాజిక న్యాయం, బలహీనుల సాధికారతలో గణనీయమైన పెరుగుదలకు నాంది పలికింది. నదీ జలాల సద్వినియోగం కరవు ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను మార్చేసింది. హంద్రీ-నీవా లాంటి కీలకమైన లిఫ్ట్ లింకేజీల ద్వారా కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు అంతటా లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. గ్రామ చెరువులను స్థిరీకరించి వ్యవసాయాన్ని బలోపేతం చేశారు’’ అని నారా లోకేశ్‌ (Nara Lokesh) పేర్కొన్నారు.

నాయకుడంటే ముందుండి నడిపించే వారని నిరూపించారు – మంత్రి పయ్యావుల

30 ఏళ్ల క్రితం ఇదేరోజు తొలిసారిగా సీఎంగా చంద్రబాబు (CM Chandrababu) ప్రమాణం చేశారని మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. తెలుగు ప్రజల తలరాతలను మార్చిన అద్భుత ఘట్టమిదన్నారు. తెలుగు జాతి ఖ్యాతి దశదిశలా వ్యాప్తికి కారణభూతమైన మహత్తర సన్నివేశమని అభివర్ణించారు. నాయకుడంటే ముందుండి నడిపించే వారని నిరూపించిన సందర్భమన్నారు. ఐటీ విప్లవం తెచ్చినా, విద్యుత్‌ సంస్కరణలు చేసినా ప్రజల కోసమే అని వివరించారు.

విజనరీ నాయకుడు దొరకడం తెలుగు ప్రజల అదృష్టం – మంత్రి డీబీవీ స్వామి

30 ఏళ్లలో చంద్రబాబు (CM Chandrababu) ఎన్నో పాలనా సంస్కరణలు తెచ్చారని మంత్రి డీబీవీ స్వామి తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారన్నారు. చంద్రబాబు వంటి విజనరీ నాయకుడు దొరకడం తెలుగు ప్రజల అదృష్టమని తెలిపారు.

వంటింటికే పరిమితమైన మహిళలను ప్రగతి బాట పట్టించారు – మంత్రి అనిత

ప్రజలకు నాణ్యమైన, పారదర్శక సేవలు అందిస్తున్న హైటెక్‌ సీఎం చంద్రబాబు అని హోంమంత్రి అనిత అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలనకు సరికొత్త నిర్వచనం చూపిన దార్శనికుడు అని కొనియాడారు. ఇంటికి, వంటింటికే పరిమితమైన మహిళలను ప్రగతి బాట పట్టించారని పేర్కొన్నారు.

పాలనలో వినూత్న పద్ధతుల్ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే – మంత్రి కొల్లు రవీంద్ర

చంద్రబాబు ప్రజల వద్దకే పాలన అంటూ గడపగడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. హైటెక్‌ సిటీ అనే నవ నగరాన్ని నిర్మించిన విజనరీ మన చంద్రబాబు అని కొనియాడారు. పాలనలో వినూత్న పద్ధతుల్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదే అని పేర్కొన్నారు.

తెలుగుజాతి వికాసానికి ఎనలేని సేవలు – మంత్రి సత్యకుమార్‌

తెలుగుజాతి వికాసానికి చంద్రబాబు ఎనలేని సేవలందిస్తున్నారని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. తెలుగుజాతి ప్రతిభా పాటవాలను విశ్వవ్యాప్తం చేశారని పేర్కొన్నారు.

వేలాది ఐటీ ఉద్యోగ అవకాశాలను సృష్టించారు – మంత్రి అచ్చెన్నాయుడు

వేలాది ఐటీ ఉద్యోగ అవకాశాలను చంద్రబాబు సృష్టించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు ప్రజల గర్వకారణమైన నాయకుడిగా మరిన్ని విజయాలు చేకూరాలన్నారు. ఆయురారోగ్యాలతో ప్రజాసేవను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

Also Read : Pawan Kalyan: చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్ శుభాకాంక్షలు

Leave A Reply

Your Email Id will not be published!