Minister Nitin Gadkari: ఇ20 ఇంధనం వినియోగంపై కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

ఇ20 ఇంధనం వినియోగంపై కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

Nitin Gadkari : ఇథనాల్‌ కలిపిన ఇ20 పెట్రోల్‌ కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకునే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పెట్రోల్‌ లో ఇథనాల్‌ మాదిరే… డీజిల్‌ లో ఐసోబ్యూటనల్‌ ను కలిపే ప్రక్రియను త్వరలోనే వేగవంతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పెట్రోల్‌ లో కలుపుతున్న ఇథనాల్‌ శాతం ఇప్పటికే 20కి చేరుకుందన్నారు. తదుపరి దశలో విమాన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ఇథనాల్‌ ను వినియోగించనున్నట్లు చెప్పారు. 20 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై స్పందిస్తూ… తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకొనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Union Minister Nitin Gadkari Key Comments on E20 Oil

దిల్లీలో సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్‌ వార్షిక సదస్సులో గురువారం నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మాట్లాడారు. ఈ సందర్భంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ పై వ్యక్తమవుతోన్న ఆందోళనలు ప్రస్తావనకు వచ్చాయి. ‘‘మీ పరిశ్రమ ఎలా పనిచేస్తుందో రాజకీయాలు కూడా అలాగే నడుస్తుంటాయి. కొందరు డబ్బులు చెల్లించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇంధన దిగుమతులకు ఇథనాల్ ఒక ప్రత్యామ్నాయం. అందుబాటు ధరలో స్వదేశంలో ఉత్పత్తి అవుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది.

సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. అంతా స్పష్టంగా ఉంది. శిలాజ ఇంధనాలు దిగుమతి చేసుకోవడానికి భారత్ భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ దిగుమతి భారాన్ని తగ్గించుకొని, ఆ మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టడమనేది మంచి చర్య కాదా..?’’ అని ప్రశ్నించారు. మొక్కజొన్న నుంచి తీసిన ఇథనాల్ వల్ల రైతులు రూ.45 వేల కోట్ల మేర లాభపడ్డారని వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రపంచం మొత్తం అంగీకరిస్తోందన్నారు. ఈ స్థాయిలో కాలుష్యం కొనసాగితే దిల్లీ ప్రజలు 10 ఏళ్ల జీవితాన్ని కోల్పోతారంటూ నివేదికలు ఉన్నాయని గుర్తుచేశారు.

ఇ20 ఇంధనం పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందా..? డ్రైవింగ్‌ను దెబ్బతీస్తుందా..? అంటూ గతంలో పలు పోస్టులు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వాటిపై ఇప్పటికే కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ భయాలన్నీ నిరాధారమైనవని పేర్కొంది. శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా అవి లేవని వెల్లడించింది. ఇథనాల్‌ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుందని వ్యాఖ్యానించింది. దానివల్ల మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ.. అది అతి స్వల్పమేనని వెల్లడించింది.

ఆటోమోటివ్ రీసెర్చ్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశీలనల్లో.. ఈ మిశ్రమ ఇంధనంతో ఇంజిన్ దెబ్బతిన్న సంకేతాలు లేవని తెలిపింది. కాగా.. శిలాజ ఇంధనాల క్షీణత, ముడిచమురు ధరల్లో అస్థిరత, కఠినమైన పర్యావరణ నిబంధనలు వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచ రవాణారంగం ఎదుర్కొంటోంది. మెరుగైన ఇంధన నాణ్యత, పర్యావరణ ప్రయోజనాల రీత్యా ఇథనాల్‌ను అత్యంత అనుకూలమైన ప్రత్యామ్నాయ రవాణా ఇంధనంగా నేడు ప్రపంచం భావిస్తోంది.

E20 ఫ్యూయల్ విషయంలో ఈ మధ్య సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ ప్రచారం నడుస్తోంది. E20 ఫ్యూయల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని.. ఇంజిన్‌కు నష్టం కలుగుతుందని పోస్టులు కనిపిస్తున్నాయి. పాత వాహనాలకూ ఇది అనుకూలం కాదు అంటూ గడ్కరీ ఆలోచనను తప్పుబడుతూ విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రచారంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM ) వార్షిక సమావేశంలో గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారం వెనుక పెట్రోల్‌ లాబీ ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాతావరణానికి కలుగుతున్న హానిని తగ్గించడంలో E20 ఫ్యూయల్ కీలక పాత్ర పోషిస్తుంది. SIAM, భారత ఆటోమొబైల్ పరిశోధనా సంఘం(ARAI) లాంటి సంస్థలు E20 ఫ్యూయల్‌ను సురక్షితమైన, సమర్థవంతమైనదిగా పేర్కొన్నాయి. మైలేజ్ తగ్గుదల అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. పైగా సుప్రీం కోర్టు కూడా E20 ఫ్యూయల్‌పై దాఖలైన PILను తిరస్కరించింది.

Also Read : Sonia Gandhi: ఓటర్‌ ఐడీ వివాదం కేసులో సోనియాగాంధీకి ఊరట

Leave A Reply

Your Email Id will not be published!