Minister Ponnam Prabhakar: ఆర్టీసీ సమ్మె విరమించండి – మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి

ఆర్టీసీ సమ్మె విరమించండి - మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి

 

 

మే 7 నుండి సమ్మెకు సిద్ధమౌతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి ,వైస్ చైర్మన్ అబ్రహాంలు మినిస్టర్ క్వార్టర్స్‌ లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిశారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్‌ కి ఆర్టీసీ సంఘాల నేతలు వివరించారు. అయితే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె ఆలోచనపై విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ సంఘాలు అయినా తమతో ఆర్టీసీ సమస్యలపై చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం లేఖ

ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం మంగళవారం మరోసారి బహిరంగ లేఖ రాసింది. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. సమ్మె పేరుతో లక్షలాదిమంది ప్రయాణికులను ఇబ్బందుల గురి చేయొద్దని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఉద్యోగుల స‌మస్యల పరిష్కారానికి యాజ‌మాన్యం కట్టుబడి ఉందని చెప్పారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోన్న సంస్థ‌కు, ఉద్యోగుల‌కు స‌మ్మె అనేది తీర‌ని న‌ష్టం క‌లిగిస్తుందని తెలిపారు. స‌మ్మె అనేది స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాదన్నారు. 2019లో జ‌రిగిన స‌మ్మె వ‌ల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయ‌బ‌డిందని అన్నారు.

కార్మికుల స‌మష్టి కృషి వ‌ల్ల అన్ని సంక్షోభాల‌ను ఎదుర్కొని… ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు చూరగొంటున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మ్మె అనేది శ్రేయ‌స్క‌రం కాదని చెప్పారు. ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాట‌ల‌కు ప్ర‌భావిత‌మై స‌మ్మెకు వెళ్తే సంస్థ‌తో పాటు ఉద్యోగుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుందని అన్నారు. ఆర్టీసీ సంస్థ‌ను అన్ని తామై ముందుకు నడిపిస్తున్న ఉద్యోగుల సంక్షేమం విష‌యంలో యాజ‌మాన్యం ఏమాత్రం రాజీప‌డ‌టం లేదని అన్నారు. సంస్థ‌కు వ‌చ్చే ప్ర‌తి రూపాయిని మీ సంక్షేమం కోసం వెచ్చిస్తామని తెలిపారు. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని అన్నారు. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైందని చెప్పారు.సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించిన, విధులకు ఆటంకం కలిగించిన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave A Reply

Your Email Id will not be published!