Minister Ponnam Prabhakar: ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే – పొన్నం ప్రభాకర్
ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే - పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar : తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదు. కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రైతులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్‌పై ఉంది. ఎరువుల విషయంలో రైతుల్లో భయాందోళనలు సృష్టించి భారత రాష్ట్ర సమతి నేతలు రాక్షసానందం పొందుతున్నారు. రైతులకు అవసరమైన ఎరువుల్లో 60 శాతం మాత్రమే కేంద్రం నుంచి వచ్చింది. అందువల్లే కొంత ఇబ్బంది కలుగుతోంది. రాష్ట్రం నుంచి ఏదైనా సమస్య వస్తే బాధ్యత వహించడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.
Ponnam Prabhakar – యూరియాను కనీసం చూడని నేతలూ విమర్శిన్నారు – మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, యూరియా సరఫరాపై సమీక్షించారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
‘‘రాష్ట్రానికి ఆగస్టు వాటా యూరియా ఇవ్వాలి. అత్యవసరాన్ని గుర్తించి త్వరగా ఇవ్వాలి. యూరియాను కనీసం చూడని నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడి అభాసుపాలు కావద్దు. నన్ను విమర్శించే వారు కేంద్రమంత్రి నడ్డాను అడగవచ్చు. యూరియా సరఫరాపై అన్ని లెక్కలు ఇస్తున్నాను. రామచందర్‌రావు అంటే నాకు గౌరవం. అబద్ధాలు చెప్పి భాజపాను బాగు చేయాలంటే సాధ్యం కాదు.
రైతులపై రాజకీయాలు చేసి పార్టీని పెంచుకోలేరు. వాస్తవాలను రామచందర్‌రావు ఒప్పుకోవాలి. యూరియాపై ఎప్పటికప్పుడు లెక్కలు కేంద్రానికి పంపుతున్నాం. నిన్నగాక మొన్న వచ్చిన రామచందర్‌రావు విమర్శలు సరికావు. శవాలపై పేలాలు ఏరుకునేలా భాజపా వ్యవహారం ఉంది. యూరియాపై భాజపా అసత్య ప్రచారం మానుకోవాలి. రామచందర్‌రావుకు పలుకుబడి ఉంటే యూరియా తెప్పించాలి. ఆయనకు అంత పలుకుబడి ఉందని నేను అనుకోను. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉంది. యూరియాను దాచుకొని మేం ఏం చేసుకుంటాం? పదేపదే విమర్శలు సరికాదు. బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. యూరియాపై కేంద్ర మంత్రుతు బండి సంజయ్, కిషన్‌రెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడా. కేంద్రాన్ని ఒప్పించి రామచందర్‌రావు.. యూరియా తెప్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తున్నాం. కేంద్రం కూడా సహకరించాలి.’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Also Read : Shubhanshu Shukla: అంతరిక్షయానం అనేది యావత్ దేశ లక్ష్యం – శుభాంశు శుక్లా
