Minister Rajnath Singh: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. పాక్ తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ… రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా జరిగి తీరుతుందంటూ తేల్చి చెప్పారు. అందుకు తాను హామీ ఇస్తున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ కార్యక్రమంలోపాల్గొన్న రాజనాథ్ సింగ్… ఈ వ్యాఖ్యలు చేసారు.
ఈ సందర్భంగా రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ… ‘‘మన వీర సైనికులు ఎల్లప్పుడూ దేశ భౌతిక స్వరూపాన్ని కాపాడుతుంటే… రుషులు, జ్ఞానులు దేశ ఆధ్యాత్మిక రూపాన్ని పరిరక్షిస్తున్నారు. ఒక వైపు మన సైనికులు యుద్ధ భూమిపై పోరాడుతుంటే… సాధువులు జీవన భూమిపై పోరాడుతున్నారు. దేశ సరిహద్దుల భద్రతతో పాటు సైనికులను కాపాడటం నా బాధ్యత. దేశంపై దాడికి ప్రయత్నించేవారికి తగిన రీతిలో బదులివ్వడం నా విధి. మీకు మన ప్రధాని గురించి బాగా తెలుసు. ఆయన వర్కింగ్ స్టైలేంటో, పట్టుదల ఏంటో తెలుసు. ఆయన సారథ్యంలో మీరు కోరుకున్నది కచ్చితంగా జరుగుతుందని మీకు హామీ ఇస్తున్నా. భారత్ శక్తి సాయుధ దళాల్లోనే కాదు.. దాని సంస్కృతి, ఆధ్యాత్మికతలోనూ ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, పాక్‌పై ప్రతీకార చర్యలను కేంద్రం పరిశీలిస్తున్న వేళ రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మరో వైపు, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ… వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా… భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.