Rushikonda: రుషికొండలో పర్యాటక శాఖ రిసార్ట్ ను ప్రారంభించిన మంత్రి రోజా !

రుషికొండలో పర్యాటక శాఖ రిసార్ట్ ను ప్రారంభించిన మంత్రి రోజా !

Rushikonda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని విశాఖ మహానగరంలోని రుషికొండలో సుమారు రూ. 450 కోట్లతో నిర్మించిన పర్యాటక శాఖ రిసార్ట్ ను గురువారం ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం నిర్మించిన ఈ భవనానికి న్యాయపరమైన సమస్యలు ఉండటంతో… పర్యాటకశాఖ రిసార్ట్ గా దీనిని ప్రారంభించినట్లు తెలుస్తోంది. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేతులు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్ నాధ్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వరప్రసాద్‌ రెడ్డి, ఇతర పాలకమండలి సభ్యులు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Rushikonda Resort Opened by Roja

ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ ఋషికొండలో(Rushikonda) 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని.. వీటిని పర్యాటక రిసార్ట్స్‌గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో రుషికొండ నిర్మాణాలను… త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ కార్యాలయంగా కొనసాగిస్తామా ? లేదా ? అనేది భవిష్యత్తులో నిర్ణయిస్తామన్నారు. వీటి నిర్మాణానికి విపక్షాలు అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. అన్ని అనుమతులు తీసుకొనే నిర్మాణాలు చేపట్టినట్టు మంత్రి అమర్‌ నాథ్ స్పష్టం చేసారు.

అయితే విశాఖలో రుషికొండ(Rushikonda) రిసార్ట్‌ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత రహస్యంగా చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు రూ.450 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాల ప్రారంభోత్సవానికి… అతి కొద్దిమందికే ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది. సీఎం జగన్‌, మంత్రి రోజా చిత్రాలతో కూడిన ఆహ్వానపత్రికలను కూడా నగరంలోని ముఖ్యమైన వైసీపీ నేతలకు మాత్రమే పంపిచినట్లు తెలుస్తోంది. రుషికొండ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభం పేరుతో ఆ ఆహ్వానాలు అందజేశారు. విశాఖను కార్వనిర్వాహక రాజధానిగా ప్రకటించిన అనంతరం విశాఖ నుండే పరిపాలన కొనసాగిస్తానని గతంలో పలుమార్లు సీఎం జగన్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రుషికొండలో ఉన్న టూరిజం రిసార్ట్స్ ను ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించి… అక్కడి నుండే సీఎం జగన్ పరిపాలన కొనసాగిస్తారని ప్రకటించారు. అయితే ఈ భవన నిర్మాణాలతో పాటు రాజధాని తరలింపు అంశం కోర్టు పరిధితో ఉండటంతో రహస్యంగా, టూరిజం రిసార్ట్ పేరిట ఈ భవనాలను పర్యాటక శాఖ మంత్రి రోజా చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Also Read : A.Md. Imtiaz IAS: వైసీపీలో చేరిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ !

Leave A Reply

Your Email Id will not be published!