Minister Satya Kumar: గిరిజన ప్రాంతాల్లో 90% వైద్యుల పోస్టుల భర్తీ – మంత్రి సత్యకుమార్
గిరిజన ప్రాంతాల్లో 90% వైద్యుల పోస్టుల భర్తీ - మంత్రి సత్యకుమార్
Minister Satya Kumar : గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర శాసనసభలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) మాట్లాడుతూ… “ఉద్యోగ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణలవల్ల వైద్యుల కొరత ఏర్పడుతుండగా వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యమే లక్ష్యంగా వాక్-ఇన్-ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాం. వదోన్నతులు కూడా చేబడుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన అనంతరం గిరిజన ప్రాంతాల్లోని 153 పీహెచ్సీలకు కలిపి 306 సివిల్ అసిస్టెంటు సర్జన్ పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ఖాళీగా ఉన్న 138కు 131 పోస్టుల (90%)ను గత 5 నెలల్లో భర్తీ చేశాం. ప్రస్తుతం 31 పోస్టులు (10%) ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Minister Satya Kumar Comments
ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా ఆసువత్రిని బోధనాసుపత్రిగా మార్చేందుకు గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో గందరగోళం నెలకొన్నందున వైద్యులు, మౌలిక సదుపాయాలకు కొరత ఏర్పడింది. నిర్మాణాలకు రూ.47 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. 625 పడకలతో మార్కావురం వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్ సర్వీస్ కోటా పీజీ చేసేందుకు వెళ్లిన సుమారు 250 మంది వైద్యులు నవంబరులో రానున్నారు. వీరిని అవసరమైన ఆసుపత్రుల్లో నియమిస్తాం. కనిగిరి, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెంలోని ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.
గుండెపోటుతో బాధవడే వారికి స్పెషలిస్టు వైద్యుల ద్వారా స్టెమీ విధానంలో రూ.45వేలు విలువచేసే ఉచిత ఇంజెక్షన్ చికిత్స అందిస్తున్నాం. స్టెమీ విధానంలో సుమారు 4వేల మంది రోగులు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కోలుకున్నారు. పీహెచ్సీ స్థాయిలో స్టెమీ విధానం అమలుకు స్పెషలిస్టు వైద్యుల అవసరముంది. పీహెచ్సీల్లో వీరు లేనందున అక్కడ స్టెమీ సౌకర్యాన్ని అందుబాటులోనికి తీసుకురావడం కష్టమవుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల మాతృత్వ మరణాలు 38.8% నుంచి 30%కు తగ్గాయి” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar) వివరించారు.
చాగంటి కోటేశ్వరరావును అభినందించిన మంత్రి నారా లోకేష్
విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) గారిని సలహాదారుగా నియమించామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఆయన రూపొందించిన పుస్తకాలను ప్రింట్ చేసి విద్యార్థులకు అందిజేస్తున్నాం. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అభినందించాలి. ఆయన ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోవడం లేదు. నేను ఆశ్చర్యపోయా. కనీసం ప్రభుత్వం నుంచి ఫోన్ కూడా తీసుకోలేదు. వాటర్ బాటిల్ కూడా తీసుకోవడం లేదు. అద్భుతమైన పుస్తకాలను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ను తీసుకువస్తాం. న్యాస్ నివేదికను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, బీసీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పెట్టారని ఎక్కడైనా సమాచారం ఉంటే సభ్యులు వివరాలు అందజేయాలి. ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తాం. నాకున్న సమాచారం ప్రకారం ఆ విధంగా ఎక్కడా జరగడం లేదని అన్నారు.
కూటమి ప్రభుత్వంలో 9,600 ప్రాథమిక పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడుని అందించామని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్య లేదని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలను ఫీజు నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందా అని మండలిలో కుడిపూడి సూర్యనారాయణ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ… APSERMC చట్టాన్ని 2019లో తీసుకురావడం జరిగింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ ను ప్రైమరీ స్కూళ్లలో అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 117 జీవో వల్ల కేవలం 1200 పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే… కూటమి ప్రభుత్వంలో సుమారు 9,600 ప్రాథమిక పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ను అందజేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్యలో చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను మోటివేట్ చేస్తున్నాం. లెర్నింక్ అవుట్ కమ్స్ పై శ్రద్ధ పెడుతున్నాం. విద్యార్థుల్లో నైతిక విలువల పెంపు కోసం చర్యలు చేపట్టాం.
Also Read : DSP Nalini: మాజీ డీఎస్పీ నళినిని కలిసిన కలెక్టర్ ! ఎందుకంటే ?
