Sophia Qureshi: కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సిందూర్ లో సైనిక అధికారిణి కల్నల్ సోఫియా ఖురేష్, వ్యోమికా శర్మ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత్ నారీశక్తి యొక్క ప్రతాపం పాకిస్తాన్ కు రుచిచూపించారు అంటూ వారిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి.
‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్ కు పంపించి పాఠం నేర్పించారు’ అని ఇందౌర్ సమీప గ్రామంలో మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని కాంగ్రెస్ నేతలు ప్రధానికి విజ్ఞప్తిచేశారు. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. మధ్యప్రదేశ్ బీజేపీ అధిష్ఠానం ఆ మంత్రిని పిలిపించి చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని షా విలేకరులకు చెప్పారు. ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ లో మా సైనికులు11 మంది చనిపోయారు – పాకిస్తాన్
భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో తమ స్క్వాడ్రన్ లీడర్ సహా 11 మంది సైనికులు చనిపోయారని, మరో 78 మంది గాయాలపాలయ్యారని పాక్ మిలటరీ ప్రకటించింది. అంతేకాక, మరో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 121 మంది గాయపడ్డారని పేర్కొంది. మృతుల్లో పాక్ వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగ్జేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్ తదితరులు ఉన్నారని వెల్లడించింది. కాగా, రావల్పిండిలోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ స్వయంగా పరామర్శించారు. మరోపక్క, కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ మంగళవారం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్‌పై ప్రసంగిస్తూ మోదీ సోమవారం చేసిన వ్యాఖ్యలను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించింది. కాల్పుల విరమణ కోరుతూ భారత్ వద్దకు పాకిస్థాన్ పరుగెత్తుకుంటూ వచ్చిందనేది మరో పచ్చి అబద్ధం అని ఆరోపించింది. మోదీ వ్యాఖ్యలు, భారత్ తీరు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.