Shivraj Singh Chauhan : ఎయిర్ ఇండియా విమాన సంస్థపై భగ్గుమన్న కేంద్రమంత్రి

కానీ విమానం లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఓ విరిగిన సీటు కాస్తంత కుంగి కనిపించిందని చెప్పారు...

Shivraj Singh Chauhan : ఎయిర్ ఇండియా విమానంలో తనకు పాడైన సీటు కేటాయించడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chauhan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా టిక్కెట్ డబ్బులు తీసుకుని అరకొర సౌకర్యాలు కల్పించడం ప్రయాణికులను మోసగించడమే అని మండిపడ్డారు. అసలేం జరిగిందీ చెబుతూ ఆయన నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. పూసాలో కిసాన్ మేళాలో పాల్గొనేందుకు ఎయిర్ ఇండియా ఏఐ436 విమానంలో ఢిల్లీ నుంచి భోపాల్‌కు వెళ్లిన సందర్భంగా ఈ దారుణ అనుభవం ఎదురైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సీట్ నెం 8సీని తాను ముందస్తుగానే బుక్ చేసుకున్నట్టు చెప్పారు. కానీ విమానం లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఓ విరిగిన సీటు కాస్తంత కుంగి కనిపించిందని చెప్పారు.

Shivraj Singh Chauhan Comments

ఫ్లైట్ అటెండెంట్‌లను ప్రశ్నిస్తే సంస్థ యాజమాన్యానికి ముందే సమాచారం ఇచ్చామని వారు తెలిపినట్టు పేర్కొన్నారు. ఆ సీటు టిక్కెట్టును విక్రయించొద్దని కూడా తాము సూచించినట్టు పేర్కొన్నారు. విమానంలో పాడైన సీట్లు ఇంకా కొన్ని ఉన్నాయని వారు తనతో తెలిపినట్టు కూడా వెల్లడించారు. ‘‘తమ సీట్లో కూర్చోమని కొందరు ప్రయాణికులు కోరారు. కానీ వారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే, ఆ సీటులోనే కూర్చుని ప్రయాణం చేశా. టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లాకైనా ఎయిర్ ఇండియా(Air India) మెరుగవుతుందని అనుకున్నా. కానీ అది తప్పని నాకు ఇప్పుడు అర్థమైంది. ప్యాసెంజర్లు పూర్తిస్థాయిలో డబ్బులు ఇస్తున్నప్పుడు వారికి పాడైన, అసౌకర్యంగా ఉండే సీట్లు కేటాయిస్తే ఎలా? ఇది మోసం చేయడం కాదా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమంత్రి పోస్టుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆయనకు క్షమాపణలు చెప్పడమే కాకుండా అసలేం జరిగిందో తెలుసుకుని పరిస్థితి చక్కదిద్దుతామని హామీ ఇచ్చింది. ఎయిర్‌ఇండియాను టాటాలు 2022లో ప్రభుత్వం నుంచి రూ.18 వేల కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎయిర్ ఇండియా సేవలు మరింతగా విస్తరించినా సేవాలోపాలపై మాత్రం జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Also Read : Kash Patel : హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పై ప్రమాణం చేసిన అమెరికా ఎఫ్బిఐ డైరెక్టర్

Leave A Reply

Your Email Id will not be published!