Minister Sridhar Babu: కేసీఆర్ కు కాళేశ్వరం కమీషన్ నోటీసులపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
కేసీఆర్ కు కాళేశ్వరం కమీషన్ నోటీసులపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు విలేకర్లుతో మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు ఇప్పుడే కదా ఇచ్చింది… ఆయన వెళ్తారనే తాను అనుకుంటున్నానన్నారు. అయితే చట్టం ముందు అందరూ సమానమేనని ఆయనని చెప్పారు. తప్పు చేయక పోతే భయం ఎందుకు అంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరంలో తనపై కేసీఆర్ పెట్టిన కేసులు ఎదుర్కొన్నానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన తప్పేం లేదంటూ కేసును కోర్టు కొట్టేసిందన్నారు. ఎనిమిదేళ్ల పాటు… ఈ కేసులతో పోరాడానని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
మరోవైపు గత కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్లాది రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించింది. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్‌లోని కొన్ని పిల్లర్లు కుంగాయి. ఈ నేపథ్యంలో దీనిని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మలుచుకొంది. తాము అధికారంలోకి వస్తే.. దీనిపై విచారణ జరిపిస్తామని ప్రకటించింది. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో జస్టిస్ పిసి ఘోష్ సారథ్యంలో కమిషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ కమిషన్… ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై విచారణ చేపట్టింది. అందులోభాగంగా ఇప్పటికే వరకు ఉన్నతాధికారులు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే తాజాగా నాటీ సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన హయాంలో ఆర్థిక శాఖ మంత్రులుగా పని చేసిన ఈటల రాజేందర్, హరీశ్ రావులకు సైతం నోటీసులు జారీ చేసింది. వీరింతా విడివిడిగా విచారణకు హాజరుకావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో కమిషన్ స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్… ఈ విచారణకు హాజరువుతారా? లేదా అన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది.