Minister Srinivasa Varma :స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ

2019లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయి...

Srinivasa Varma : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర ఉక్క శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కొన్ని కారణాల వల్ల నష్టాల్లో ఉందన్నారు. దేశంలో అత్యున్నతమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఆయన అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు.

Minister Srinivasa Varma Comment

రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు ఆర్థిక ప్యాకేజీని కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్దికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ(Srinivasa Varma) వివరించారు. మరోవైపు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి ఇటీవల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పర్యటించారు. ఆ క్రమంలో సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సంస్థ ప్రైవేటీ కరణ జరగదని ఆయన ఈ సందర్బంగా సిబ్బందికి భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి హెచ్ డి కుమారస్వామి విశాఖపట్నం పర్యటనలో ఆయన వెంట శ్రీనివాస వర్మ(Srinivasa Varma) ఉన్నారు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీగా నిధులు సైతం కేటాయిస్తుందన్న సంగతి తెలిసిందే.

2019లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయి. ఆ సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. ఈ సంస్థ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయింది. అంతేకాకుండా.. కేంద్రంతో ఈ అంశంపై వైసీపీ ఎంపీలు సైతం కనీసం ఎప్పుడు చర్చించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో స్టిల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. వారికి అండగా నిలబడేందుకు నాటి అధికార ప్రజా ప్రతినిధులు సైతం చొరవ చూపలేదు. అయితే ఒకటి రెండు సార్లు మాత్రం విశాఖపట్నం వేదికగా.. నిరసనలు తెలిపేందుకు గత అధికార పార్టీల నేతలు దీక్షకు దిగి మమ అనిపించారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అదీకాక కూటమిలో బీజేపీ సైతం భాగస్వామ్యం కావడంతో.. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. అందులోభాగంగా రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భారీగా కేటాయింపులు జరుపుతోంది. ఆ క్రమంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేసేందుకు కేంద్రం తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది.

Also Read : ఈ 18న రిటైర్ కానున్న సీఈసీ రాజీవ్ కుమార్..కొత్త సీఈసీ ఎంపిక

Leave A Reply

Your Email Id will not be published!