Minister Uttam Kumar Reddy: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణ - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy : తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ఈ ప్రాజెక్టులకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించిందని ఆయన వివరించారు. శనివారం లక్డీకాపూల్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సదరన్ ట్రావెల్స్ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడారు.
Minister Uttam Kumar Reddy Key Comments on Tourism
2025- 30 పర్యాటక నూతన విధానం లో భాగంగా తెలంగాణను (Telangana) ప్రపంచంలోని టాప్ 5 పర్యాటక గమ్యస్థానాలలో ఒకటి నిలపడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు కొత్తగా జలపాతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, వారసత్వ ప్రాంతాలు, ఏకో-టూరిజం, వెల్నెస్ కేంద్రాలు, క్రాఫ్ట్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. దీనితో పాటు మరో 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ప్రాంతీయ రింగ్ రోడ్ల వెంట డ్రై పోర్టులు, గోదావరి, కృష్ణా నదులపై రివర్ బెస్ట్ టూరిజం, నగరాల్లో వాటర్ ఫ్రంట్ హబ్‌ల వంటి ప్రత్యేకతలతో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని, పర్యాటక రంగ అభివృద్థికి సదరన్ ట్రావెల్స్ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. ఈ కృషిలో భాగంగా డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు కూడా ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.
క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు – మహేష్ కుమార్ గౌడ్
కులాలు, మతాల పేరిట బీజెపీ భవిష్యత్తు లేకుండా చేస్తోందని, క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని జెండా ఆవిష్కరించారు. బీజేపీ దేశ రాజ్యాంగం మార్చాలని చూస్తుందని, రాజ్యాంగ సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందన్నారు. స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పోరాడిందని, దేశ రక్షణకు అదే దీక్షతో పని చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరాభవన్ లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాంగ్రెస్ పార్టీకి (Congress) యువజన కాంగ్రెస్ గుండెకాయ లాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం ఉత్సాహంగా పని చేయాలన్నారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి ఎఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషన్‌పై రూపొందించినపవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను గాంధీభవన్‌లో ప్రదర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొన్నం, జూపల్లి, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు ఈ ప్రెజెంటేషన్‌ను చూశారు.
Also Read : Hyderabad Vande Bharat: దేశంలోని టాప్ 10 సర్విసుల్లో హైదరాబాద్ వందేభారత్ కు చోటు
