Minister Vangalapudi Anitha: విజయనగరంలో హోం మంత్రి అనిత కొవ్వొత్తుల ప్రదర్శన

విజయనగరంలో హోం మంత్రి అనిత కొవ్వొత్తుల ప్రదర్శన

 

 

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులు, ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మ చేకూరాలని విజయనగరంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ శాఖా మంత్రి వంగలపూడి అనిత, ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద అమరులైన భారత సైనికలకు పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుండి కలెక్టరాఫీసు కూడలి వరకు విద్యార్థులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, అమరులైన భారత సైనికులకు మద్దతుగా నినాదాలు చేసారు.

 

కలెక్టరాఫీసు కూడలి వద్ద అమరలైన భారత సైనికుల ఫోటోలు వద్ద క్యాండిల్స్ పెట్టి, నివాళులు అర్పించి, మానవహారంగా ఏర్పడి, నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అతిధి విజయ గజపతి, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, పలువురు పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు, నర్సింగు విద్యార్థులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత మాట్లాడుతూ… భారతదేశం ఎంత సంయమనం పాటించినప్పటికీ పాకిస్తాన్ దేశం ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా దుందుడుకు చర్యలు పాల్పడుతుందన్నారు. కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం వెళ్ళిన టూరిస్టులపై తీవ్రవాదులు 26మంది టూరిస్టులను, వారి మతాలను అడిగి, విచక్షణ రహితంగా కాల్పులు జరిపి, వారి కుటుంబ సభ్యుల ముందే హతమార్చడం హేయనీయమైన చర్యల అన్నారు. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం మహిళా అధికారుల నేతృత్వంలో సిందూర్ ఆపరేషన్ చేపట్టి, దేశ సరిహద్దుల్లోని తీవ్రవాదుల స్థావరాలపై దాడులు చేసిందన్నారు. అంతేతప్పా, పాకిస్తాన్ ప్రజలపైనగాని, వారి సైన్యం పైన గాని భారత సైన్యం ఎటువంటి దాడులకు పాల్పడలేదన్నారు. కానీ, పాకిస్తాన్ విచక్షణ మరిచి, భారత్ సైన్యంపై దాడులకు పాల్పడిందన్నారు. ఈ పోరాటంలో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు మనమందరం అండగా నిలవాలన్నారు.

 

మన రాష్ట్రంలో సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ దేశ రక్షణకు పరితపించి, సైన్యంలో చేరి, సిందూర్ ఆపరేషనులో పాల్గొని వీరమరణం పొందారన్నారు. తాను మురళి నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్నానని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చానన్నారు. మురళి నాయక్ బంధువులు, స్నేహితులు ద్వారా తనకు మురళి నాయక్ ఎప్పుడు తాను మరణించేటప్పుడు దేశ జెండా తన దేహంపై ఉండాలని అనేవారని, చివరకు మరణించే సమయంలో కూడా తన కజిన్కి ‘అమ్మ జాగ్రత్త’ అని మెసేజ్ చేసారన్న విషయం తెలిసి, తాను ఎంతో కలత చెందానన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మృతి చెందిన సైనిక కుటుంబాలకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని హెూం మంత్రివర్యులు వంగలపూడి అనిత అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!