Minister Vijay Shah: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్‌ షాపై కేసు నమోదు

కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్‌ షాపై కేసు నమోదు

Minister Vijay Shah : పాకిస్తాన్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’గురించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, దేశ ప్రజలకు ఎప్పుకప్పుడు సమాచారం అందించిన మహిళా సైనికాధికారి, కల్నల్‌ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్‌ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, బీజేపీ నేత విజయ్‌ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత సైనికాధికారిణి కల్నల్‌ ఖరేషీని ఉద్దేశిస్తూ ఆమెను ‘ఉగ్రవాదుల సోదరి’ అని విజయ్‌ షా(Minister Vijay Shah) వ్యాఖ్యానించారు. ఇది కాస్త తీవ్ర దుమారం రేగడంతో మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు బుధవారం సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని జస్టిస్‌ అతుల్‌ శ్రీధరణ్, జస్టిస్‌ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదుచేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ… దేశంలో ఇంకా ‘సమగ్రత, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థం, గౌరవం, అజేయమైన ధైర్యం నిండి ఉన్న సంస్థ ఒక్క సైన్యం మాత్రమే’నని పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును కోర్టు గురువారం ఉదయం 10.30గంటలకు వాయిదా వేసింది. అటు జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్‌ నాయకుడు ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పందించారు. విజయ్‌ షాను(Minister Vijay Shah) ‘మూర్ఖుడు’ అని ఆయన సంబోధించారు. మరోవైపు విజయ్‌ షాపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రధాని మోదీని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది.

Minister Vijay Shah – అసలేమిటీ వివాదం ?

మంత్రి విజయ్‌ షా(Minister Vijay Shah) మంగళవారం ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్‌ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకాశ్మీర్‌ లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు. అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్‌ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రివర్గం నుంచి తొలగించాలి – కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌

విజయ్‌ షాను తక్షణమే మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ డిమాండ్‌ చేశారు. విజయ్‌ షా వ్యాఖ్యలను బీజేపీ సీనియర్‌ నేత ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. ఆయనొక మూర్ఖుడు అని మండిపడ్డారు. బుద్ధిజ్ఞానం లేకుండా మాట్లాడడం కొందరికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయ్‌ షా అభ్యంతకర వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత మాయావతి సైతం ఖండించారు. మహిళా అధికారి గురించి అలా మాట్లాడడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కార్‌ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపర్చేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. యూనిఫాంలో విధులు నిర్వర్తించే మహిళా అధికారులను గౌరవించాలని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ అనుచితంగా మాట్లాడడాన్ని సహించబోమని హెచ్చరించారు.

పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధం – విజయ్‌ షా

తన వ్యాఖ్యల పట్ల దుమారం రేగుతుండడంతో విజయ్‌ షా బుధవారం స్పందించారు. ఎవరైనా బాధపడి ఉంటే ఒకటి కాదు పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కల్నల్‌ సోఫియా ఖురేషిని తన సోదరి కంటే ఎక్కువగా గౌరవిస్తున్నానని చెప్పారు.

Also Read : AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్‌ ఎదుట హాజరైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!