Digital Arrest Scam: ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు 31 లక్షలు టోకరా

‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు 31 లక్షలు టోకరా

Digital Arrest Scam : ఈ మధ్యకాలంలో ‘డిజిటల్‌ అరెస్ట్‌’ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సామాన్యులే కాదు చదువుకున్న వాళ్లు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులూ వీటి బారిన పడుతున్నారు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా సైబర్‌ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కారు. ఆయనను బెదిరించి ఎనిమిది రోజుల్లో రూ.30.99 లక్షలు దోచుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Digital Arrest Scam Viral

బీదర్ జిల్లాలోని ఔరద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకీల్‌కు ఆగస్టు 12న సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారినంటూ ఓ ఫోన్‌కాల్ వచ్చింది. మనీలాండరింగ్‌ కేసులో ఓ నిందితుడిని అరెస్టు చేయగా అతడి వద్ద మాజీ ఎమ్మెల్యే బ్యాంకు అకౌంట్ వివరాలు, ఏటీఎం కార్డు దొరికాయని చెప్పాడు. ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చంటూ వకీల్‌ను హెచ్చరించాడు. కాసేపటికి మరో వ్యక్తి ఫోన్‌ చేసి దర్యాప్తు అధికారినంటూ వకీల్‌ను సంప్రదించాడు. ఆయన వ్యక్తిగత, ఆస్తి వివరాలు తీసుకున్నాడు. అనంతరం వకీల్‌ను డిజిటల్ అరెస్ట్‌ (Digital Arrest Scam) చేస్తున్నట్లు చెప్పాడు.

మరుసటి రోజు వకీల్‌ కు వీడియో కాల్‌ చేసి ఆన్‌లైన్‌లో నకిలీ కోర్టును, న్యాయమూర్తిగా ఒకరిని చూపించి నమ్మించారు. నకిలీ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి వకీల్ నిర్దోషిగా పేర్కొంటూ ఓ ఒప్పందంపై సంతకం చేయాలని ఆదేశించాడు. ఆ తతంగం తర్వాత సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఆర్‌టీజీఎస్‌ (RTGS) ద్వారా రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించాడు. దర్యాప్తు తర్వాత ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుందని హామీ ఇచ్చాడు.

దాదాపు ఎనిమిది రోజులు వకీల్‌ ను డిజిటల్‌ అరెస్ట్ చేశారు. సైబర్‌ నేరగాళ్లు అయన నుంచి రూ. 30.99 లక్షలను పలు దఫాలుగా బదిలీ చేయించుకున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే… సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read : CP Radhakrishnan: ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ఘన విజయం

Leave A Reply

Your Email Id will not be published!