MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
MLC Ananthababu : దళిత యువకుడు, తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టు స్టే కు నిరాకరించడంతో ఈ కేసు పునర్విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి.
MLC Ananthababu Case Updates
2022 మే 19న కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. డ్రైవర్‌ను హతమార్చిన ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu)… మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హత్య తానే చేశానని అనంతబాబు అంగీకరించారని మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు పంపారు. తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. తమకు న్యాయం చేయాలని… ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది.
కేసు విషయంలో న్యాయం చేస్తామని, నిందితులను శిక్షిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే మృతుడి తల్లి ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకున్నారు. కేసు సమగ్ర దర్యాప్తునకు అనుమతి కోరుతూ ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును కోరగా… న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది.
Also Read : KTR: ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ! బర్త్‌డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి !
