MLC Kavitha: రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి – ఎమ్మెల్సీ కవిత

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి - ఎమ్మెల్సీ కవిత

 

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్‌ అందుబాటులో ఉంచారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని కుదువపెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. టీజీఐఐసీని పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో ఇచ్చారని ఆరోపించారు. అన్ని భూములను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లో కుదువపెట్టేలా జీవో తీసుకొచ్చారన్నారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూములను కుదువ పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని చెప్పారు. హైదరాబాద్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.

ఈ సందర్భంగా ‘‘టీజీఐఐసీని పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారిస్తే ఎందుకు దాచారో సీఎం జవాబివ్వాలి. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో పెట్టాక 1.75 లక్షల ఎకరాలకు ఎవరిది బాధ్యత? నిపుణుల సిఫార్సు లేకుండా చేస్తే జీవోను ఉపసంహరించుకోవాలి. భూములు కుదువ పెట్టి… వచ్చిన డబ్బు పక్కదారి పట్టించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసింది. రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పులు, వడ్డీల కోసం చెల్లించారు. మిగిలిన రూ.లక్ష కోట్లు ఎక్కడికి పోయాయి? ప్రభుత్వ అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఆమె డిమాండ్ చేసారు.

పార్టీలో నాపై కొందరు దుష్ప్రచారం

 

నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నా. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలే చెబుతున్నా. పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. పార్టీలో నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అది సరికాదు. సమయం వస్తే అన్నీ బయటకు వస్తాయి. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను. నాపై దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని భావిస్తున్నా’’ అని కవిత తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!