MLC Kavitha: బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌

బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌

MLC Kavitha : భారత రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్‌, టి.రవీందర్‌రావు పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది.

MLC Kavitha Expelled from BRS Party

‘‘ఇటీవల కాలంలో కవిత (MLC Kavitha) ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు’’ అని భారత రాష్ట్ర సమితి పేర్కొంది. కవిత ప్రస్తుతం నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు.

కొంతకాలంగా భారత రాష్ట్ర సమితితో విభేదిస్తున్న కవిత (MLC Kavitha).. ఎక్కువగా తెలంగాణ జాగృతి తరఫున నిర్వహించే కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలున్నాయని.. తనపై కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఇటీవల ఆరోపించారు. గతంలో పరోక్ష విమర్శలు చేసిన కవిత.. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక.. పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని కవిత వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానంతో ఆమె విభేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్‌ చేసింది.

కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌

ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) సస్పెండ్‌ చేస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ‘‘కేసీఆర్‌ నిర్ణయంతో మహిళలు ఎక్కువగా సంతోషపడుతున్నారు. కవిత వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితికి నష్టం చేసేలా, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. నష్ట నివారణ, కార్యకర్తలకు స్థైర్యం ఇచ్చేందుకు కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా ఉపేక్షించేది లేదని ఆయన గతంలో చెప్పారు.. అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు.

20 నెలలుగా కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తుంటే… కవిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న సైనికుల కంటే పేగుబంధం గొప్పది కాదని కేసీఆర్ (KCR) భావించారు. కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాం’’ అని సత్యవతి రాథోడ్‌ అన్నారు.

బీఆర్ఎస్ ను విమర్శిస్తే… కేసీఆర్‌ను విమర్శించినట్టే – గొంగిడి సునీత

భారత రాష్ట్ర సమితిని విమర్శిస్తే… కేసీఆర్‌ను విమర్శించినట్టేనని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ‘‘పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అని కవిత అంటున్నారు. రెండు సార్లు ఎంపీ టికెట్‌, రెండు సార్లు ఎమ్మెల్సీ అవకాశం ఎలా వచ్చింది. క్షేత్రస్థాయికి వెళ్తే కవితకు పరిస్థితులు అర్థం అవుతాయి. కవితకు కేసీఆర్‌ కన్నతండ్రి.. కోట్లాది మంది ప్రజలు కేసీఆర్‌ను బాపు అని పిలుచుకుంటున్నారు. పార్టీకి చాలా మంది ద్రోహం చేశారు. అందులో తాను కూడా ఉండాలని కవిత అనుకుంటే ఏం చేయలేం. కవిత తనకు తానే గొయ్యి తీసుకున్నట్లు అర్థం అవుతుంది. వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో కాలమే తేలుస్తుంది. కవితకు పార్టీ అనేక అవకాశాలు కల్పించింది. పార్టీ నుంచి బయటకు వెళ్లిన చాలా మంది ఏమయ్యారో అందరికీ తెలుసు, కవిత కూడా అంతే’’ అని సునీత అన్నారు.

పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదన్న విషయం స్పష్టమైంది – ఎమ్మెల్యే వివేకానంద

ఎమ్మెల్సీ కవిత విషయంలో కేసీఆర్‌ (KCR) నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కవిత చర్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని కేసీఆర్‌ గుర్తించారని చెప్పారు. పార్టీకి నష్టం చేస్తే ఎవరినీ ఉపేక్షించకూడదనే సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తప్పు చేస్తే కుటుంబసభ్యులనైనా సహించనని కేసీఆర్‌ గతంలోనే చెప్పారని, కన్న బిడ్డకంటే కష్టంలో పార్టీకి అండగా ఉన్నవారే ముఖ్యమని చాటారని తెలిపారు. పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదన్న విషయం స్పష్టమైందని ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యానించారు.

పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవు – పల్లా రాజేశ్వర్‌రెడ్డి

పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే కవితపై చర్యలు తీసుకున్నట్లు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. 60లక్షల పార్టీ కార్యకర్తల మనోభావాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘‘పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవు. కన్నబిడ్డ కంటే పార్టీ శ్రేయస్సే ముఖ్యమని కేసీఆర్‌ తెలియజేశారు. కాంగ్రెస్‌ ఉచ్చులో పడి ఆ పార్టీ చెప్పినట్లు కవిత నడుచుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ కలహాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు’’అని అన్నారు.

Also Read : PM Narendra Modi: తన మాతృమూర్తి హీరాబెన్‌ పై వీడియోపై స్పందించిన ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!