MLC Kavitha: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు
MLC Kavitha : ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలు ఉపయోగించి ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని గుత్తా నివాసంలొ ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘‘తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందన్నారు. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందన్న కవిత (MLC Kavitha).. రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
MLC Kavitha Raise a Complaint
‘‘తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. బోనం ఎత్తుకున్న ఆడబిడ్డను అమ్మవారిలా చూసే సంస్కృతి మనది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మహిళలు రాజకీయాల్లోకి వస్తూ ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు పరుషపదజాలంతో విమర్శలు చేస్తే వచ్చేవాళ్లు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఉచ్ఛరించలేని దారుణమైన వ్యాఖ్యలను మల్లన్న చేశారు. ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావద్దా?ఏదైనా ఉంటే అంశం ప్రాతిపదికన మాట్లాడాలి తప్ప ఏం మాటలివి? దాదాపు ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తున్నాం. ఏ రోజూ తీన్మార్ మల్లన్నను (Teenmar Mallanna) ఒక్క మాట కూడా అనలేదు. నన్ను ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదు.
తెలంగాణ ప్రజలు పరుష పదజాలాన్ని సహించరు. మల్లన్న చేసిన వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు వెళ్లారు. సామాన్యులపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఎందుకు?ఇది ప్రజాస్వామ్యం. దీనిలో అనేకమంది ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయి. జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది.. అందులో బీసీ ఉద్యమం ఒకటి. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం. నాలాంటి వాళ్లను కోట్లాది మందిని తయారు చేస్తా. తక్షణమే తీన్మార్ మల్లన్నను సీఎం రేవంత్ అరెస్ట్ చేయించాలి. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తాం’’ అని కవిత అన్నారు.
‘‘ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి.. మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని ఛైర్మన్ సూచించారు. వెంటనే తీన్మార్ మల్లన్నను (Teenmar Mallanna) ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలి. 24 గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ? సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరు అసలు.. నన్నెందుకు అడ్డుకుంటాననీ అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడు’’ అంటూ కవిత (MLC Kavitha) వ్యాఖ్యానించారు.
కాగా, ఆదివారం తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణా జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా, 3.30 గంటలకు డీజీపీని కలిసి కవిత ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు.
డీజీపీకి కవిత ఫిర్యాదు
తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి కవిత ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో ఆమె డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : Hyderabad Police: వాట్సప్ కోడ్‌తో గచ్చిబౌలి పోలీసుల డెకాయ్ ఆపరేషన్
