MLC Kavitha: బీఆర్ఎస్ బహిష్కృత నేత కవిత సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ బహిష్కృత నేత కవిత సంచలన వ్యాఖ్యలు
MLC Kavitha : భారత రాష్ట్ర సమితి లోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని బీఆర్‌ఎస్ మాజీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆరోపించారు. ఆ బాధతోనే తాను ఇలా మాట్లాడుతున్నానని కవిత స్పష్టం చేసారు. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కుటుంబ వ్యవహారంపైనా కీలక వ్యాఖ్యలు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
MLC Kavitha Shocking Comments
ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా కుటుంబం బాగుండొద్దు.. మేం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం వస్తుంది. నేను, నాన్న, అన్న కలిసి ఉండటం చాలా మందికి ఇష్టం లేదు. దీనిలో భాగంగా మొదటిగా నన్ను బయటకు పంపించారు. అదిక్కడితో ఆగదు. నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి. రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న (కేటీఆర్)కు, మీకూ పొంచి ఉంది. భారత రాష్ట్ర సమితిని హస్తగతం చేసుకునే కుట్రలోనే నన్ను బయటకు పంపించారు’’ అని కవిత (MLC Kavitha) వ్యాఖ్యానించారు. భవిష్యత్తు గురించి కాదు… నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నా. విచారణ లేకుండా, వివరణ తీసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. కోట్ల మందిలో ఒక్కరు కేసీఆర్. అలాంటి వ్యక్తి నాకు తండ్రి కావడం నా అదృష్టం.
ఎంత పెద్ద నేతలైనా కొంత ఒత్తిడి ఉంటుంది. కేసీఆర్‌పైనా (KCR) ఇప్పుడు అలాంటి ఒత్తిడే ఉండి ఉంటుంది. ఆడబిడ్డలు చెడు కోరుకోరు. కానీ, ఎంత బాధ కలిగి ఉంటే నేను ఇలా మాట్లాడుతా. కుటుంబంలో ఎన్నో అవమానాలు జరిగాయి. కానీ, అవన్నీ చెప్పుకోలేను. అందుకే పార్టీ పరంగా ఉన్న సమస్యల గురించే మాట్లాడా. నిజాయితీని నిరూపించేందుకు రాజీనామా చేశా. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నందుకు బాధగా లేదు. రాజకీయంగా పొరపచ్చాలు ఇవాళ ఉంటాయి… రేపు తొలగిపోతాయి. కానీ, మా అమ్మకు దూరంగా ఉండాల్సి రావడమే నన్ను బాధిస్తోంది అన్నారు. ఈ క్రమంలో… కుటుంబ కలహాలను ప్రస్తావన తెస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, పోస్టుల గురించి ఆమె స్పందించారు. ఎవరెవరితోనో నన్ను పోలుస్తూ కొందరు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. పనీపాటా లేని వాళ్లే అలాంటి పనులు చేస్తారు. అలాంటి వాళ్లు చేసేవాటికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారామె.
‘అక్రమ కేసులు పెట్టి తిహాడ్ జైలులో ఐదున్నర నెలలు ఉండి వచ్చాక గతేడాది నవంబర్ 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత (MLC Kavitha) తెలిపారు. గురుకులాలు, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం అందించాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేశామన్నారు. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చినపుడు గళమెత్తినట్లు చెప్పారు. బనకచర్ల, భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కవిత (MLC Kavitha) తెలిపారు. సీఎం సొంత జిల్లాలో భూనిర్వాసితులకు అండగా ఉన్నామని చెప్పారు. 47 నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలను కలుపుకొని.. గులాబీ కండువాలతో అనేక ప్రజాసమస్యలపై మాట్లాడామన్నారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై భారత రాష్ట్ర సమితి పెద్దలు పునరాలోచన చేయాలన్నారు.
హరీశ్‌రావు, సంతోష్ ఇళ్లల్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా ?
‘‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీసీల అంశంపై మాట్లాడుతుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెప్పాను. దానిలో తప్పేముంది? నా తండ్రి కేసీఆర్ (KCR) చిటికెన వేలు పట్టుకుని ఓనమాలు నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ (KCR). చెప్పింది చెప్పినట్లు ఆయన చేశారు. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అది సామాజిక తెలంగాణ కాదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? సామాజిక తెలంగాణ భారత రాష్ట్ర సమితికి అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా?బంగారు తెలంగాణ అంటే హరీశ్‌రావు (Harish Rao), సంతోష్ ఇళ్లల్లో బంగారం ఉంటే అవుతుందా?సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది.
రామన్నా.. నిన్ను బుజ్జగించి అడుగుతున్నా
నేను రామన్న (కేటీఆర్)ను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. నాకైతే అనుమానమే. హరీశ్‌రావు, సంతోష్ గురించి ఆలోచించాలని కేసీఆర్‌కు బిడ్డగా చెబుతున్నా. తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచీ హరీశ్‌రావు లేరు. పార్టీ పెట్టిన 10 నెలల తర్వాత వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు (Harish Rao) ఎప్పుడో లొంగిపోయారు. ఆయన్ను గమనించుకో రామన్న (కేటీఆర్). సీఎం రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారా? లేదా? చెప్పాలి. సంతోష్, హరీశ్‌రావు గ్యాంగ్‌లు భారత రాష్ట్ర సమితికి పట్టిన జలగలు. వాళ్లిద్దరూ మా మంచి కోరుకునే వారు కాదు. హరీశ్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్‌కు సీబీఐ మరక అంటింది.
గతంలో పార్టీకి ఒక్క క్షణం చెడ్డపేరు రాగానే హరీశ్‌రావు వెళ్లి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలవలేదా? ఆయన ట్రబుల్ షూటర్ కాదు… బబుల్ షూటర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో మాట్లాడి రెండో అభ్యర్థిని పెట్టాలని హరీశ్ రావు ప్రతిపాదించారు. ఓ బీజేపీ ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి చెబితే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. హరీశ్‌రావు ట్రబుల్ క్రియేట్ చేసి… పరిష్కరించినట్లు నటిస్తారు. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీశ్ రావు విడిగా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బు కాళేశ్వరం అవినీతిది కాదా ? 2009లో కేటీఆర్‌ను ఓడించేందుకు నాడు డబ్బు పంపారు. 2007 నుంచి నేను రోడ్డుపైనే ఉన్నాను. కేసీఆర్ ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడాలని కేటీఆర్‌ను కోరుతున్నాను. ఆరడుగుల బుల్లెట్ ఇవాళ నన్ను గాయపరిచింది… రేపు ఎవరిని గాయపరుస్తుందో? హరీశ్‌రావు కారణంగానే ఈటల రాజేందర్, జగ్గారెడ్డి మొదలైన వారంతా పార్టీ నుంచి బయటకు వెళ్లారు. దుబ్బాక, హుజురాబాద్‌లో పార్టీ ఓటమికి ఆయనే కారణం. హరీశ్‌రావు నక్క జిత్తులను గమనించాలి.
కేసీఆర్ వెంట నీడలా ఉండే సంతోష్ కు ధనదాహం ఎక్కువ. హరితహారం మాటున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట నకిలీ కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్‌లో నా ఓటమితో ప్రారంభించి… కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి వరకు కుట్ర చేశారు. మాజీ ఎమ్మెల్యేల్లో చాలా మంది సంతోష్ బాధితులు ఉన్నారు. భారత రాష్ట్ర సమితి సాఫ్ట్‌వేర్ అయితే… తెలంగాణ జాగృతి హార్డ్‌వేర్. పార్టీకి నా కంట్రిబ్యూషన్ లేదా? కేవలం హరీశ్ రావు, సంతోష్‌ది మాత్రమే ఉందా? మేకవన్నె పులులను పార్టీలో ఉంచుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేను. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్‌కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. హరీశ్‌రావు, సంతోష్, శ్రవణ్‌లే ఫోన్ ట్యాపింగ్ చేయించారు. నేను ఏ పార్టీలోనూ చేరేది లేదు. ఇప్పుడు బాధలో ఉన్నా. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటా. ఆ తర్వాత అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. నేను ప్రజల వద్దకే వెళ్తా’’అని కవిత అన్నారు.
Also Read : Urea: తెలంగాణాలో యూరియా కోసం బారులు తీరుతున్న రైతులు
