MLC Winners: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయం

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయం

MLC Winners : ఏపీలో రెండు పట్టభద్ర, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికల్లో కూటమి బలపరచిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం(MLC Winners) సాధించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పీఆర్టీయు అభ్యర్ధి గాదె శ్రీనివాసుల నాయుడు విజయం సాధించారు.

అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏపీటీఎఫ్ అభ్యర్ధి పాకలపాటి రఘువర్మకు టీడీపీ(TDP), జనసేన(Janasena) నాయకులు బహిరంగ మద్దత్తు తెలపగా… పీఆర్టీయు అభ్యర్ధి గాదె శ్రీనివాసుల నాయుడికి మాత్రం పరోక్షంగా మద్దత్తు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్ధిని చిత్తుగా ఓడించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం అవుతోందని ప్రతిపక్ష వైసీపీ(YCP) నాయకులు ఆరోపించడంతో… కూటమి నేతలు నష్ట నివారణా చర్యలు ప్రారంభించారు. గాదె శ్రీనివాసుల నాయుడికి కూడా కూటమి మద్దత్తుతో గెలుపొందాడంటూ పలువురు నాయకులు ప్రకటించారు.

AP MLC Winners – కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం

ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి విజయానికి కావాల్సిన ఓట్లు (51శాతం) రాజశేఖరం సాధించారు. దీంతో మరో రౌండ్‌ లెక్కింపు ఉండగానే ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టరు ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసారు. ఏడు రౌండ్‌లు పూర్తయ్యేసరికి.. మొత్తంగా 1,12,331 ఓట్లను పేరాబత్తుల రాజశేఖరం సాధించారు. తన ప్రత్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 41,268 ఓట్లు పోలయ్యాయి. దీనితో కూటమి అభ్యర్థి 71,063 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి 1,96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వాటిలో చెల్లిన ఓట్లు 1,78,422 ఉండగా.. చెల్లనివి 17,578 ఓట్లున్నాయి. దాదాపు 22,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది.

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఘన విజయం

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఘన విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ, మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్‌ పూర్తయ్యే సరికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్‌ ముగిసే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా, ఏడో రౌండ్‌ పూర్తయ్యే సరికి 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. దీనితో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు. ఇక తొమ్మిదో రౌండ్‌ పూర్తయ్యే సరికి ఆలపాటికి 1,45,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజార్టీ దక్కింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60 శాతం పైగా ఓట్లను ఆలపాటి సాధించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు విజయం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ తరఫున పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటాపోటీగా సాగిన ఎన్నికలో ఏపీటీఎఫ్‌ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన గెలుపొందారు. ఏయూలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరివరకు ఉత్కంఠగా సాగింది. ఈ ఎన్నికల్లో 10 మంది బరిలో ఉన్నా… పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసులునాయుడు, పీడీఎఫ్‌ అభ్యర్థి విజయగౌరి, ఏపీటీఎఫ్‌ అభ్యర్థి రఘువర్మ మధ్యే పోటీ నెలకొంది. నువ్వానేనా అన్నట్లు పోటీ సాగగా ఆఖరుకు రఘువర్మను ఎలిమినేట్‌ చేశారు. మొత్తం పోలైన ఓట్లు 20,791 అయితే చెల్లిన ఓట్లు 20,135. ఇందులో 10,068 ఓట్లతో మేజిక్‌ ఫిగర్ని అందుకోవాల్సి ఉండగా గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. దీనితో ఆయన గెలిచినట్లు ప్రకటించారు.

కూటమి గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని: సీఎం చంద్రబాబు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవనిగా పనిచేస్తుందన్నారు. ‘‘గతంలో 3 రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారు. అసాధ్యమనుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సుసాధ్యమైంది.

విశాఖ రైల్వేజోన్‌ పూర్తి చేసుకున్నాం. రూ.1.9లక్షల కోట్లతో ఎన్టీపీసీ, జెన్‌కో ప్లాంటు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని తెదేపా కార్యకర్తలకు పిలుపునిచ్చాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే కలిశాం.. స్వప్రయోజనాలు లేవు. మూడు పార్టీలు కలిసి సమైక్యంగా పనిచేశాం’’ అని సీఎం వివరించారు. ఈ విజయోత్సవ సభలో టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రులు నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Also Read : Payyavual Keshav: వైసీపీ సమాజానికి హానీకరం – మంత్రి పయ్యావుల కేశవ్

Leave A Reply

Your Email Id will not be published!