Mock Drills: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‌లో మాక్‌ డ్రిల్స్‌

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‌లో మాక్‌ డ్రిల్స్‌

Mock Drills : జమ్మూకశ్మీర్‌ లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ తో భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్త ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రహోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్‌ లో సివిల్‌ మాక్‌ డ్రిల్స్ నిర్వహించారు. ఆపరేషన్‌ అభ్యాస్‌ పేరుతో హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ మాక్‌ డ్రిల్స్ లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు, ఫైర్, విద్యుత్తు, ట్రాన్స్‌పోర్ట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Mock Drills in Hyderabad

యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు ఈ మాక్‌ డ్రిల్‌(Mock Drills) నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్‌ మోగింది. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వివరించారు. నగరంలోని నాలుగు ప్రాంతాలు (నానల్‌నగర్‌, కంచన్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌ ఎన్‌ఎఫ్‌సీ) నుంచి కొనసాగిన మాక్‌ డ్రిల్స్‌ను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

మరోవైపు, మాక్‌ డ్రిల్‌లో(Mock Drills) భాగంగా ఫైరింగ్‌ జరిగినట్లుగా శబ్దాలు వినబటం, కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండటం, ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే.. అక్కడ ఉన్నవారిని ఏ విధంగా సురక్షితంగా బయటకు తీసుకురావాలి అనే విషయాలను కళ్ళకు కట్టినట్లుగా ఈ మాక్‌డ్రిల్‌ లో ప్రదర్శించారు. డీఆర్‌డీఏ సమీపంలోని ఓ కాలనీలోని 24 అంతస్తుల భవనంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా సురక్షితంగా కాపాడాలనే అంశాన్ని వివరించారు. అక్కడ ఫైరింజన్లను మోహరించారు. మొత్తంగా 12శాఖల అధికారుల సమన్వయంతో ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. కాల్పుల్లో గాయపడిన వారిని తోటివారి సహాయంతో సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనే అంశంపై అవగాహన కల్పించారు.

54 ఏళ్ల తర్వాత సిటీలో మాక్ డ్రిల్ – సీపీ ఆనంద్

ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీపీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ… పాకిస్థాన్ తో యుద్ధం నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్(Mock Drills) నిర్వహించామన్నారు. 54 సంవత్సరాల తర్వాత జరిగిన మాక్ డ్రిల్ ఇదని ఆయన పేర్కొన్నారు. మాక్ డ్రిల్ లో… తమ తమ లోపాలను సమీక్షించుకుని అప్రమత్తత మెరుగు పర్చేలా చేశామని తెలిపారు. యుద్ధానికి సంబంధించి లేదా ఇతర ఏ విషయాలకు సంబంధించైనా తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.

“నాలుగు గంటలకు కమాండ్ కంట్రోల్స్ సెంటర్ నుండి అలెర్ట్ ఇచ్చాం. రెండు నిమిషాల పాటు పోలీస్, ఫైర్ వాహనాలు, ఇండస్ట్రియల్ సైరన్లు మోగాయి. నాలుగు ప్రాంతాల్లో మిస్సైల్ అటాక్ జరిగినట్టు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సందేశం ఇచ్చాం. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. నాలుగు ప్రాంతాల్లో పోలీసులు, మెడికల్, ఫైర్ డిజాస్టర్ రెవిన్యూ ఇతర విభాగాల అధికారులు అందుబాటులో ఉన్నారు. మిస్సైల్ అటాక్ జరిగిన ప్రాంతాలకు తరలి వెళ్లడం… మంటలు అంటుకుంటే ఆర్పడం వంటి అంశాలను డ్రిల్ లో చూపించాం. అంబులెన్స్ లు రావడానికి వెళ్లడానికి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చాం. ఈ మాక్ డ్రిల్ లో లా అండ్ ఆర్డర్ పోలీసులు క్రౌడ్ కంట్రోల్ చేశారు. మాక్ డ్రిల్ లో భాగంగా గాయపడిన క్షతగాత్రులకు వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు.” అని ఆనంద్ వెల్లడించారు. ఇలా ఉండగా, అటు నగరంతో పాటు, ఏపీలోని కీలక నగరమైన విశాఖలోనూ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

Also Read : Gali Janardhana Reddy: ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు జైలు శిక్ష

Leave A Reply

Your Email Id will not be published!