Modi Mann Ki Baat : అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖకు ప్రధాని మోదీ
ఆదివారం మన్ కీ బాత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రేడియోలో ప్రసంగించారు...
Mann Ki Baat : విశాఖపట్నం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో తాను పాల్గొనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రకృతి సౌందర్యానికి విశాఖపట్నం ప్రసిద్దిగాంచిందన్నారు. అక్కడ యోగా చేయడం గొప్ప అనుభూతిని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం మన్ కీ బాత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రేడియోలో ప్రసంగించారు. ఈ ఏడాది జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైజాగ్ వేదికగా జరుగుతుందన్నారు.
PM Modi Mann Ki Baat
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగా ఆంధ్ర’ అనే ప్రత్యేక ప్రచారాన్ని నెల ముందే ప్రారంభించిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ(Narendra Modi) గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రతి గ్రామానికి, పాఠశాలకు యోగా సాధనను పరిచయం చేయడం ఈ యోగా ఆంధ్ర ఉద్యమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఈ ఉద్యమంలో 10 లక్షల మందికిపైగా యోగా అభ్యాసకులు పాల్గొనబోతున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక శిబిరాలు, స్కూల్ యోగా ప్రోగ్రామ్‌లు, మెగా ఈవెంట్‌లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమయ్యాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణలో డ్రోన్ దీదీలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నారన్నారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారని వివరించారు. పండ్ల తోటలపై పురుగుమందులు, పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వీరిని స్కై వారియర్స్‌గా ప్రధాని మోదీ అభివర్ణించారు.
అందువల్ల కలిగే లాభాలను ఆయన సోదాహరణగా వివరించారు.. సాంప్రదాయ పద్ధతుల కంటే వేగంగా, సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చునన్నారు. నీటిని, మందుల వినియోగాన్ని 30–40% వరకు తగ్గించ వచ్చునని చెప్పారు. మహిళల ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెరిగిందని గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఇది ఒక గొప్ప ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్’ పథకం కింద మహిళా సమూహాలకు రాయితీతో డ్రోన్లు అందిస్తోందని వివరించారు. శిక్షణా కేంద్రాలు, డ్రోన్ లైసెన్సింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఈ మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ విపులీకరించారు.
Also Read : CM Revanth Reddy: ‘తెలంగాణ రైజింగ్-2047’ కు చేయూతనివ్వండి – సీఎం రేవంత్