Monorail Train: ముంబైలో ట్రాక్‌ మధ్యలో నిలిచిన మోనో రైలు

ముంబైలో ట్రాక్‌ మధ్యలో నిలిచిన మోనో రైలు

Monorail Train : ముంబయి మహా నగరంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఎలివేటెడ్‌ ట్రాక్‌పై నడిచే మోనో రైలు నిలిచిపోయింది. అధిక రద్దీ కారణంగా విద్యుత్ సరఫరాలో స్వల్ప అంతరాయంతో సాయంత్రం 6.38గంటల సమయంలో మైసూర్‌ కాలనీ- భక్తి పార్క్‌ స్టేషన్ల మధ్య ఈ రైలు దాదాపు రెండు గంటలకు పైగా ఆగిపోయింది. ఆ సమయంలో రైలులో 400 మంది చిక్కుకోగా… అందరినీ సురక్షితంగా కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేక క్రేన్‌లు తీసుకొచ్చి ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు.

Monorail Train – ప్రయాణికుల రద్దీ పెరగడమే కారణం !

అధిక రద్దీ కారణంగా విద్యుత్ సరఫరాలో సమస్య కారణంగానే రైలు ఆగిపోయినట్లు ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(MMRDA) అధికారులు వెల్లడించారు. తమ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని… ఈ దర్యాప్తులో అధిక రద్దీ కారణంగా మోనో రైలు మొత్తం బరువు అసలు డిజైన్‌ 104 టన్నుల సామర్థ్యం కాగా… ఆ బరువు 109 మెట్రిక్‌ టన్నులకు పెరిగినట్లు తేలిందని పేర్కొన్నారు. హార్బర్‌ లైన్‌ మూసివేయడంతో చాలా మంది ప్రయాణికులు మోనో రైలు వైపు వచ్చారని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు వెంటనే బీఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం ఇచ్చారని బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌(BMC) ఓ ప్రకటనలో తెలిపింది. వెంటనే అప్రమత్తమైన ముంబయి అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొంది. గత రెండు రోజులుగా భారీ వర్షాల కారణంగా ముంబయిలో సాధారణ జనజీవనం స్తంభించింది.

Also Read : CM Revanth Reddy: ఎన్టీఆర్‌ స్ఫూర్తితో చంద్రబాబు, కేసీఆర్‌, జగన్ సహకరించాలి – సీఎం రేవంత్‌

Leave A Reply

Your Email Id will not be published!