Mother Dairy: ఏపీకు మదర్ డెయిరీ పెట్టుబడులు ! పండ్ల ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటుకు సిద్ధం !
ఏపీకు మదర్ డెయిరీ పెట్టుబడులు ! పండ్ల ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటుకు సిద్ధం !
Mother Dairy : ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. మదర్ డెయిరీ సఫల్ పేరిట ఇప్పటికే పలుచోట్ల తాజా పండ్లు, కూరగాయల రిటైలింగ్ లో ఉన్న ఈ సంస్థ చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.150 – 200 కోట్ల వరకు పెట్టుబడులతో ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
Mother Dairy Investments
ఈ మేరకు మదర్ డెయిరీ(Mother Dairy) మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బాండ్లిష్ మాట్లాడుతూ… రూ.600 కోట్లతో రెండు (గుజరాత్, ఆంధ్రప్రదేశ్) పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
గుజరాత్(Gujarat)లోని బరోడా సమీపంలోని ఇటోలాలో రూ.400 కోట్ల వ్యయంతో ఒక ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. ఇది రెండేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ ‘పీటీఐ’తో అన్నారు. ఇందుకు బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. ఇటోలాలోని ప్లాంటు రెండేళ్లలో పూర్తవుతుందన్న ఆయన… కుప్పంలో ఏర్పాటుకు సంబంధించి తమకు భూకేటాయింపు జరగ్గానే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. దీనిపై ఇంకా డీపీఆర్ తయారుకాలేదన్నారు.
ప్రస్తుతం మదర్ డైరీ సఫల్ బ్రాండ్‌కు మూడు చోట్ల ( బెంగళూరు, రాంచీ, మంగోల్‌పురి -ఢిల్లీ)పండ్లు, కూరగాయల ప్రాసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ మూడు ప్లాంట్లలో ఏడాదికి రెండు లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తున్నారు. మరోవైపు పాలు, పాల ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు రూ. 500 కోట్లకు పైగా పెట్టుబడులతో న్యూ నాగ్‌పుర్‌లో ప్లాంటు నిర్మాణం జరుగుతోందని.. 2026 నాటికి అక్కడి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాండ్లిష్ తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించిన ఇడ్లీ-దోశె పిండికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. రోజుకు ఒక టన్ను చొప్పున తయారు చేస్తున్నట్లు చెప్పారు.
అయితే రాష్ట్రంలో చాలా డైరీలు ఉండగా… గత వైసీపీ ప్రభుత్వం గుజరాత్ నుండి అమూల్ ను తీసుకువచ్చింది. రాష్ట్రంలో పలుచోట్ల పెట్టుబడులు పెట్టింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం నుండి రాయితీలు పొందడం కూడా జరిగింది. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ… అమూల్ సంస్థపై అనేక ఆరోపణలు చేసింది. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమూల్ సంస్థ… చాలా సైలంట్ గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మదర్ డైరీ పెట్టుబడులకు ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.