Air India: విమానం దారి మళ్ళించిన ఘటనపై స్పీకర్‌ కు ఎంపీల ఫిర్యాదు

విమానం దారి మళ్ళించిన ఘటనపై స్పీకర్‌ కు ఎంపీల ఫిర్యాదు

Air India : తాము ప్రయాణిస్తున్న తిరువనంతపురం- దిల్లీ ఎయిరిండియా (Air India) విమానాన్ని చెన్నైకు మళ్లించడాన్ని ఎంపీలు ప్రశ్నించారు. సదరు విమానయాన సంస్థ తమ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌కు చెందిన కేసీ వేణుగోపాల్ సహా ఐదుగురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అంతేకాదు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును కోరారు.

Air India Flight Diversion

పార్లమెంట్‌ సభ్యులు కేసీ వేణుగోపాల్ (K C Venugopal), కొడికున్నిల్‌ సురేశ్‌, ఆదూర్‌ ప్రకాశ్, కె.రాధాకృష్ణన్, సి.రాబర్ట్‌ బ్రూస్‌ సహా 150 మంది ప్రయాణికులతో కూడిన ఎయిరిండియా విమానం ఈ నెల 10న తిరువనంతపురం నుంచి దిల్లీకి బయల్దేరింది. మార్గమధ్యంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని చెన్నైకి మళ్లించారు. ఆ సమయంలో బెంగళూరు, కోయంబత్తూరు వంటి ఇతర విమానాశ్రయాలు సమీపంలోనే ఉండగా… చెన్నైకు మళ్లించడాన్ని ఎంపీలు ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక కారణాన్ని సంస్థ వివరించలేదన్నారు.

అయితే విమానాన్ని చెన్నైకు మళ్లించినప్పటికీ… నేరుగా ల్యాండ్‌ చేయలేదని, అక్కడే గంటకుపైగా చక్కర్లు కొట్టినట్లు ఎంపీలు తెలిపారు. తొలిసారి ల్యాండింగ్‌కు విఫలయత్నం చేశారని… బహుశా రన్‌ వేపై మరో విమానం ఉండటం వల్ల కావచ్చనే పైలట్‌ ప్రకటనను ఉటంకించారు. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత మరో విమానంలో దిల్లీకి వెళ్లినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై తాము ఆందోళనలు లేవనెత్తగా… తప్పుడు ప్రకటనలు చేశామంటూ ఎయిరిండియా చిత్రీకరించిందన్నారు. తద్వారా ఎంపీల ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా తేరుకోలేదని… కొన్ని నెలలుగా అనేక సాంకేతిక లోపాల ఘటనలు నమోదవుతున్న తరుణంలో… ఎయిరిండియా తీరు ఆమోదయోగ్యం కాదని కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌ నాయుడుకు రాసిన లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. అత్యవసర మళ్లింపులు, రన్‌వే భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్‌లను మరింత బలోపేతం చేయాలని, అటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read : Bedroom Jihadis: కశ్మీర్‌ బలగాలకు సవాల్‌ గా మారిన ‘బెడ్‌రూం జిహాదీలు’

Leave A Reply

Your Email Id will not be published!