MP Kalyan Banerjee: న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kalyan Banerjee : కోల్‌కతాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల్లో లా కాలేజీ మాజీ విద్యార్థి కూడా ఉన్నాడు. పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల్లో ఒకరు మొదట బాధితురాలికి వివాహ ప్రతిపాదన చేశాడని పోలీసులకు తెలిపాడు. బాధితురాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు, నిందితుడు తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించాడు.
MP Kalyan Banerjee Comments
పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను సమర్థించనని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) అన్నారు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేయాలని, కొంతమంది ఇలాంటి నేరాలు చేస్తారని వ్యాఖ్యానించారు. కానీ ఒక స్నేహితుడు మృగంగా మారి తన స్నేహితుడిపై అత్యాచారం చేస్తే ఏం చేస్తామని, కాలేజీల్లో కూడా పోలీసులు ఎప్పుడూ ఇక్కడే ఉంటారా అంటూ ఎంపీ (MP) సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పందంగా మారాయి. ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి, ఇలా మాట్లాడటం ఏంటని ఎంపీ తీరుపై అనేక మంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఈ కేసులో ప్రధాన నిందితుడితో అభిషేక్ బెనర్జీ చిత్రాలను పంచుకున్నారు. అత్యాచారం చేసిన వ్యక్తిని రక్షించేది టీఎంసీ అని ఆయన అన్నారు. మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వం న్యాయం గొంతును అణచివేయనివ్వబోమన్నారు. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ కోల్‌కతా (Kolkata) పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి తక్షణ దర్యాప్తునకు ఆదేశించింది. భారత పౌర భద్రతా కోడ్ సెక్షన్ 396 కింద ఆమెకు పరిహారం ఇవ్వాలని NCW తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ (West Bengal) బీజేపీ… మమతా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ పాలనలో మహిళలపై నేరాలు నిరంతరం పెరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో మహిళలు సురక్షితంగా తిరిగే పరిస్థితి లేదని పేర్కొంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా బీజేపీ యువ మోర్చా కస్బా పోలీస్ స్టేషన్ వెలుపల నిరసన తెలిపింది. ఆ సమయంలో బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. దీంతో పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేశారు. ఆ క్రమంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు గాయపడగా, మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులతో టీఎంసీ దోస్తీ ? ఫొటోతో బీజేపీ ఆరోపణ
లా విద్యార్ధిని గ్యాంగ్ రేప్ నిందితులకు… టీఎంసీ అగ్రనేతలకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ బీజేపీ నేతలు అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 26న సౌత్ కలకత్తా లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే చోటుచేసుకున్న తాజా ఉదంతం బెంగాల్‌లో మరోమారు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ కేసులోని నిందితులకు, టీఎంసీ అగ్ర నేతలకు మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విమర్శల దాడి ప్రారంభించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి, పార్టీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియాలు తాజాగా సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆరోగ్య మంత్రి చంద్రిమా భట్టాచార్యతో సహా పలువురు టీఎంసీ నేతల పక్కన నిందితుడు మనోజిత్ మిశ్రా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ఒక పోస్టులో షేర్ చేశారు.
‘మళ్లీ మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులకు అండగా నిలుస్తోంది. మనోజిత్ మిశ్రా టీఎంసీ సభ్యుడు అని బీజేపీ నేత భండారి పేర్కొన్నారు. టీఎంసీ నిందితులను కాపాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఎందుకు మౌనం? ఎవరిని కాపాడుతారు?” అని బీజేపీ నేత మాల్వియా ప్రశ్నించారు. మమతా బెనర్జీ పాలన.. బెంగాల్ మహిళలకు ఒక పీడకలగా మారిందని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతల ఆరోపణలకు స్పందించిన టీఎంసీ మహిళా నేత శశి పంజా ఈ ఘటనను ఖండించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. ఇది తనకు ఎంతో బాధ కలిగించిందని, ఈ కేసలో నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని, వారి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారని ఆమె తెలిపారు.
Also Read : Tungabhadra: జూలై 10న తుంగభద్ర జలాల విడుదల
