MP KC Venugopal: విమానంలో సాంకేతిక లోపం ! ఎంపీ కేసీ వేణుగోపాల్‌ భావోద్వేగ పోస్ట్‌ !

విమానంలో సాంకేతిక లోపం ! ఎంపీ కేసీ వేణుగోపాల్‌ భావోద్వేగ పోస్ట్‌ !

KC Venugopal : కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు ఎంపీలు, ఇతర ప్రయాణికులు వెళ్తున్న ఓ ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో విమానాన్ని దారిమళ్లించి అత్యవసరంగా దించేశారు. దీనిపై కేసీ వేణుగోపాల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. తమకు భయానక అనుభవం ఎదురైందని, ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చామని అన్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

MP KC Venugopal Key Comments

కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఆదివారం రాత్రి దిల్లీ బయల్దేరిన ఎయిరిండియా ఏఐ2455 విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని చెన్నై మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. అయితే, ఆ సమయంలో మరో విమానం కూడా అదే రన్‌ వేపైకి వచ్చిందని, దీంతో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal) వెల్లడించారు.

‘‘ఎయిరిండియా విమానంలో నేను, మరికొంతమంది ఎంపీలు, వందల మంది ప్రయాణికులు భయానక ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చాం. అప్పటికే విమానం ఆలస్యంగా బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో కుదుపుల కారణంగా అలజడి మొదలైంది. గంట తర్వాత కెప్టెన్‌ ఓ ప్రకటన చేశారు. సిగ్నల్‌ వ్యవస్థలో లోపం కారణంగా విమానాన్ని చెన్నై మళ్లిస్తున్నట్లు చెప్పారు. ల్యాండింగ్‌ కు అనుమతి రాకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు ఎయిర్‌ పోర్టు చుట్టూనే మా విమానం గింగిరాలు తిరిగింది. ఆ తర్వాత ఏటీసీ అనుమతితో రన్‌ వేపై దిగేందుకు ప్రయత్నిస్తుండగా సరిగ్గా అదే సమయంలో మరో విమానం అక్కడే కన్పించింది. గమనించిన కెప్టెన్‌ వెంటనే ల్యాండింగ్‌ను నిలువరించి మా అందరి ప్రాణాలను కాపాడారు. రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా కిందకు దిగింది. మా అదృష్టం, పైలట్ల చాకచక్యంతో మేమంతా బతికిపోయాం’’ అని కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ప్రయాణికుల భద్రత ఇలా అదృష్టంపై ఆధారపడే పరిస్థితి రాకూడదని కాంగ్రెస్‌ ఎంపీ అన్నారు. దీనిపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ, కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖను కోరారు. దీనిపై ఎయిరిండియా స్పందించింది. విమానం సురక్షితంగా దిగిందని, ప్రయాణికులందరు తమ గమ్యస్థానాలకు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వెల్లడించింది. ఈ అసౌకర్యానికి క్షమించాలని కోరింది. ఆదివారం రాత్రి 8 గంటలకు కేరళ నుంచి బయల్దేరిన ఈ విమానం రాత్రి 10.35 గంటలకు చెన్నైలో దిగింది.

Also Read : Traffic Jam: భారీ ట్రాఫిక్‌ జామ్‌ లో అంబులెన్స్ ! నొప్పితో విలవిల్లాడుతూ మహిళ మృతి !

Leave A Reply

Your Email Id will not be published!