MP Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

MP Midhun Reddy : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణం (AP Liquor Scam) ప్రధాన కుట్రదారుల్లో ఒకరు, ఈ కేసులో కీలక నిందితుడైన (ఏ4) వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని (MP Midhun Reddy) సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ సుదీర్ఘంగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు… విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించకపోవటంతో రాత్రి 8.30 గంటల సమయంలో అరెస్ట్ చేసారు. ఈ మేరకు మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో అరెస్టైన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. జగన్‌ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో ‘వైసీపీ ముఠా’ సాగించిన దోపిడీకి కుట్ర, అమలుకు ఏర్పాట్లు, ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయటంలో మిథున్‌రెడ్డిదే ‘మాస్టర్‌ మైండ్‌’ అని సిట్‌ దర్యాప్తులో గుర్తించింది.

MP Midhun Reddy Arrest

డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్‌ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్‌వర్క్‌ రూపొందించటంలో, వారు వసూలు చేసిన మొత్తాల్ని ‘బిగ్‌బాస్‌’కు చేర్చటంలో ఆయనే కీలక పాత్ర పోషించారని తేల్చింది. పలు డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని సొంత బ్రాండ్ల మద్యం తయారు చేయించి లబ్ధి పొందటమే కాకుండా, ముడుపుల సొత్తులో ప్రతి నెలా రూ.5 కోట్ల చొప్పున వాటాగా పొందారని దర్యాప్తులో వెల్లడైంది. వీటన్నింటికీ కీలక ఆధారాలు లభ్యమవటంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఆదివారం కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్‌రెడ్డితో కలిపితే ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 12కు చేరింది.

మద్యం కుంభకోణంలో తన ప్రమేయం బయటపడిందని తెలియగానే మిథున్‌రెడ్డి మార్చి నెలలో ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అప్పటికి ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. దీనితో పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగుతున్నంత కాలం అరెస్ట్‌ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో బయటకొచ్చారు.

ఏప్రిల్‌ 19న తొలిసారి సిట్‌ విచారణకు హాజరైనా దర్యాప్తు అధికారులకు సహకరించలేదు. వారి ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదు. దీనితో మిథున్‌రెడ్డిని (MP Midhun Reddy) నాలుగో నిందితుడు (ఏ4)గా చేర్చారు. వీటన్నింటిపై విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను పునఃపరిశీలన నిమిత్తం ఏపీ హైకోర్టుకు పంపించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేస్తూ ఈ నెల 15న ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అప్పటికే అజ్ఞాతంలో ఉన్న మిథున్‌రెడ్డి వెంటనే సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లారు. అక్కడా ఎదురుదెబ్బ తగలటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిట్‌ ముందుకొచ్చారు.

కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మిథున్‌రెడ్డి శనివారం ఉదయం దిల్లీ నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు సిట్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మద్యాహ్నం 1 గంట నుండి రాత్రి 8:30 వరకు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అయితే అతను విచారణకు పూర్తిగా సహాకరించకపోవడంతో… రాత్రి అతడ్ని అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Also Read : Minister Ashwini Vaishnav: తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

Leave A Reply

Your Email Id will not be published!