MP Sudha Ramakrishnan: దేశ రాజధానిలో మహిళా ఎంపీపై చైన్ స్నాచర్ దాడి
దేశ రాజధానిలో మహిళా ఎంపీపై చైన్ స్నాచర్ దాడి
MP Sudha Ramakrishnan : దేశ రాజధాని దిల్లీలో మహిళలకు భద్రత కరువైంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ వాకింగ్ కు వెళుతూ చైన్ స్నాచర్ బారిన పడ్డారు. చాణక్యపురిలో ఉదయం నడకకు వెళుతుండగా ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ ప్రాంతంలో భారీ భద్రత ఉన్నప్పటికీ, ఆమె మెడలో నుంచి చైన్ లక్కెళ్లిన దొంగ… అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు భవన్ సమీపంలో జరిగింది. ఎంపీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
MP Sudha Ramakrishnan Chain Snatched
తమిళనాడు భవన్ నుండి ఎంపీ సుధా రామకృష్ణన్ (MP Sudha Ramakrishnan)… చాణక్యపురి ప్రాంతంలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో మరో మహిళా పార్లమెంటు సభ్యురాలు రాజతి వాకింగ్ కు వెళుతుండగా… ఒక స్కూటీపై వచ్చిన ఒక వ్యక్తి ఎంపీ సుధ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించి ఉండటంతో ఇద్దరు ఎంపీలు అతనిని గుర్తించలేకపోయారు. ఈ ఘటనలో ఎంపీ మెడకు గాయాలు కావడంతో పాటు తన చుడిదార్ కూడా చిరిగిపోయిందని ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఆమె లేఖ రాశారు. కాగా సుధా రామకృష్ణన్ తమిళనాడులోని మైలదుత్తురై నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆమె ఢిల్లీలో ఉన్నారు.
Also Read : AP High Court: ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ ప్రమాణం
