తిరుమల : ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం కలిగిన ఏకైక ఆలయంగా వినుతికెక్కిన తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా ఇప్పటికే నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర ఇవాళ పూర్తి స్తాయిలో ఈవోగా బాధ్యతలు చేపట్టారు. శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం 7.34 గంటలకు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీటీడీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి రవిచంద్ర చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో ముద్దాడ రవిచచంద్ర మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా తిరుమలలో చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. శ్రీవారి భక్తులకు సాటి భక్తుడిగా సేవ చేస్తానని చెప్పారు. భక్తుల నుండి చాలా సలహాలు సూచనలు వచ్చాయని, వాటిని తానే స్వయంగా పరిశీలించి ఆ అనుభవంతో భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ఇక నుంచి ఎవరైనా సరే తమ అభిప్రాయాలను, సూచనలను నేరుగా తెలియ చేయాలని సూచించారు. అంతే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఎంతో శ్రమకు ఓర్చి స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు ఈవో ముద్దాడ రవిచంద్ర.
