#MulkanurVillage : ముల్కనూరు ..సర్కార్ బడుల్లో చదివితేనే సర్టిఫికెట్లు
సహకారం అద్భుతం ముల్కనూరు విజయం
Mulkanur Village: సహకార వ్యవస్థకు ప్రాణం పోస్తూ లెక్కలేనంత ఆదాయాన్ని గడిస్తూ..తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్న ముల్కనూరు గ్రామ పంచాయతీ ప్రభుత్వం చేయలేని పనిని చేసింది. అక్రమాలకు పాల్పడుతూ, ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రైవేట్ బడులకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే తమ ఊరిలో ఉన్న వారు ..ఏ స్థాయిలో ఉన్నా సరే ఇక్కడి ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలు చదివిస్తేనే సర్టిఫికెట్లు జారీ చేస్తామని తీర్మానం చేసింది.
నిధులు ఎప్పుడు వస్తాయి..వచ్చిన తక్షణమే ఏ రకంగా వెనకేసుకోవాలోనని తలలు పట్టుకుంటున్న సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ గ్రామం తీసుకున్న అసాధారణ నిర్ణయాన్ని చూసి తలొంచు కోవాలి. ఊరంతా ఒక్కటి కావాలి..గుడిలో దీపం వెలగాలి, బడిలో గంట మోగాలి. అన్ని శాఖలకు చెందిన సిబ్బంది, ఉద్యోగులు ఊరులోనే ఉండాలి.
అప్పుడే మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. విద్యా రంగం భ్రష్టు పట్టి పోయింది. కేజీ టు పీజీ అంటూ జపం చేస్తున్న ప్రభుత్వం ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడంలో శ్రద్ధ చూపించడం లేదన్న ఆరోపణలున్నాయి. తెలంగాణలో కేజీ చదవాలంటే లక్ష రూపాయలు కట్టాల్సిందే. ఇంటర్ పూర్తి చేయాలంటే కనీసం 5 లక్షలు కావాల్సిందే.
ఇంక ఇంజనీరింగ్ స్టడీ చేయాలంటే కనీసం 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అప్పులు చేసి చదివించినా కొలువులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం వచ్చే ప్రైవేట్ బడుల బస్సులను తమ ఊరుకు రాణిచ్చే ప్రసక్తి లేదంటూ ముల్కనూరు గ్రామం (Mulkanur Village) తీర్మానం చేసింది.
ఈ మేరకు ఊరంతా చాటింపు వేసింది. భీమదేవరపల్లి మండలానికి చెందిన ఈ గ్రామం దేశంలోనే ఆదర్శవంతమైన పల్లెగా పేరు తెచ్చుకుంది. అక్కడంతా సహకార వ్యవస్థనే. ప్రతి ఒక్కరు ఈ సహకార సంస్థలోనే సభ్యులుగా ఉన్నారు. విద్యార్థులు లేక మూత పడుతున్న ప్రభుత్వ బడులను సమిష్టిగా కాపాడుకునేందుకు ఈ గ్రామం ఒక అడుగు ముందుకేసింది.
నూతనంగా ఎంపికైన జెడ్పీటీసీ సభ్యుడు వంగ రవీందర్, సర్పంచ్ మాడ్గుల కొమురయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపించని కుటుంబాలకు గ్రామ పంచాయతీ తరపున ఇచ్చే ధృవపత్రాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేయమంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాక ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ బస్సును ఊరు పొలిమేరల్లోకి రానివ్వమని హెచ్చరించారు. ఇక్కడ చదవక పోతే ఏ ఒక్క సర్టిఫికెట్ ఇవ్వబోమంటూ తెలిపారు. ముల్కనూరు(Mulkanur Village) చేసిన ఈ తీర్మానం తెలంగాణ ప్రభుత్వానికి, విద్యా శాఖకు, ఆయా గ్రామాలకు, ప్రజాప్రతినిధులకు చెంపపెట్టు కావాలి.
No comment allowed please