Mumbai Rains: ముంబయిలో భారీ వర్షాలు ! హోర్డింగ్ కూలి తొమ్మిది మంది మృతి !
ముంబయిలో భారీ వర్షాలు ! హోర్డింగ్ కూలి తొమ్మిది మంది మృతి !
Mumbai Rains: ముంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల దాటికి ఘాట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగు కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా… 70 మందికిపైగా గాయపడ్డారు. దాదర్, కుర్లా, మాహిమ్, ఘాట్‌కోపర్, ములుండ్, విఖ్రోలి, దక్షిణ ముంబయి(Mumbai)లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి. దీనితో ఘాట్‌కోపర్ లోని సమతా నగర్ లో 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ ఈదురుగాలుల తీవ్రతకు పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. 70 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి పలువురిని రక్షించాయి. కూలిన హోర్డింగ్ కింద కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
Mumbai Rains Viral
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈదురుగాలుల నేపథ్యంలో నగరంలో ఉన్న అన్ని హోర్డింగ్‌లపై సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో మెట్రో, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.
అయితే ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబయి నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. వడాలాలోని బర్కత్ అలీ నాకాలో శ్రీజీ టవర్ సమీపంలో వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో సాయంత్రం నాలుగు గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. ముంబయి విమానాశ్రయంలో దృగ్గోచరత పడిపోవడంతో గంటా ఆరు నిమిషాల పాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు. సుమారు 15 విమానాలను దారి మళ్లించారు. సాయంత్రం 5.03 గంటలకు రన్ వే కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే రెండు గంటలకుపైగా లోకల్ రైలు సేవలను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
Also Read : Pawan Kalyan : సతీమణితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కళ్యాణ్