Nadendla Manohar: వైసీపీ ఎమ్మెల్సీపై మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్సీపై మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

Nadendla Manohar : గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను ఉద్దేశ్యించి దుర్భాషలాడిన వైసీపీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసింది. రెండు రోజుల క్రితం నటుడు పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు… ప్రస్తుతం రిమాండ్ నిమిత్తం కడప జైలుకు తరలించారు.

మరోవైపు ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వూల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas)… జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రశ్నించడానికే పార్టీను పెట్టానన్న పవన్ కళ్యాణ్ మాత్రం… నెలకు యాభై కోట్ల రూపాయలకు నారా చంద్రబాబుకు అమ్ముడు పోయాడంటూ ఆరోపించారు. ఎన్నికల హామీలను ప్రక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తూ తప్పు మీద తప్పు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఈ సొమ్మును తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారతున్నాయి.

Nadendla Manohar Slams

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఉద్దేశ్యించి… జనసేన పీఏసీ చైర్మెన్, మంత్రి నాందేండ్ల మనోహర్(Nadendla Manohar) సంచలనం వ్యాఖ్యలు చేసారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే, హీరోలు కాదు జీరోలు అవుతారని వారిపై చర్యలు తప్పవని మంత్రి నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు. నటుడు పోసాని కృష్ణ మురళిను ఉద్దేశిస్తూ… ఇప్పటికే ఒక వ్యక్తి జైలులో లబోదిబో మంటుండగా… ఇటీవల మరో వైసీపీ ఎమ్మెల్సీ… పవన్ కళ్యాణ్ ను దుర్భాషలాడారని అన్నారు. అటువంటి వారు త్వరలో జైలు కెళ్ళడం ఖాయమని ఆయన స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో మంత్రి మనోహర్ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

పిఠాపురం వేదికగా ఈ నెల14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహక సమావేశంలో మంత్రి మనోహర్(Minister Nadendla Manohar) మాట్లాడుతూ… పిఠాపురం వేదికగా ఈ నెల14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతీ జనసేన నాయకుడు, జన సైనికుడు, వీరమహిళ తీసుకోవాలని పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌ తో జనసేన పార్టీ ఘనవిజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందన్నారు. సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో శనివారం కాకినాడలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పీఓసీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar) మాట్లాడుతూ.. ఎన్నికల్లో జనసేన అద్భుత విజయం సాధించడం వెనుక పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కష్టం, త్యాగం ఉన్నాయని అన్నారు. గత వైసీపీ పాలనలో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వ్యక్తిగత దూషణలు చేశారని అన్నారు. ఎన్నో అడ్డంకులను ధైర్యంగా దాటుకుని పవన్‌ ముందుకు సాగారని తెలిపారు. ‘పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ను వ్యక్తిగతంగా దూషించడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడారో మనం చూశాం. నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో కూర్చొని లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం మారినా నోటికొచ్చినట్లు మాట్లాడే వారిని వదిలిపెట్టాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వారిపై బురద జల్లాలని చూస్తే మీరు హీరోలు అవ్వరు… జీరోలు అవుతారు’ అని మంత్రి మనోహర్‌ హెచ్చరించారు.

Also Read : Malreddy Rangareddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!